అగ్నిసాక్షిగా పెళ్లాడాడు.. అనుమానంతో చంపేశాడు

అగ్నిసాక్షిగా పెళ్లాడాడు.. అనుమానంతో చంపేశాడు - Sakshi


► భార్యను హత్య చేసిన భర్త

► పరారీలో నిందితుడు

► దిక్కుతోచని స్థితిలో పిల్లలు




సారవకోట మండలంలోని లక్ష్మీపురం గ్రామం. శనివారం ఊరంతా నిద్రలేచి పనుల్లో మునిగిపోయింది. గ్రామానికి చెందిన మంతి మనోహర్, హర్షవర్ధన్‌లు రోజూలాగే పొద్దున్నే లేచి హోమ్‌వర్క్‌ చేసుకుంటున్నారు. సమయం గడిచిపోతోంది గానీ పక్కనే నిద్రపోతున్న తల్లి మాత్రం లేవడం లేదు. ఇంకాసేపు చదువుకున్నారు అయినా అమ్మ లేవలేదు.



రోజూ తమ కంటే ముందే నిద్రలేచే తల్లి ఇంకా ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారులకు అర్థం కాలేదు. పిలిచినా పలకకపోవడం, ఎంత లేపినా స్పందించకపోవడంతో వారు బయటకు వెళ్లి తెలిసిన వారికి ఈ విషయం చెప్పారు. వారు వచ్చి చూసే సరికే ఆ తల్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. అనుమానంతో భర్త చేసిన పనికి పిల్లలను అనాథలుగా వదిలి కన్ను మూసింది. లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.




సారవకోట(నరసన్నపేట): మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో అనుమానం పెనుభూతమై ఓ మహిళ హత్యకు దారి తీసింది. గ్రామంలో శుక్రవారం రాత్రి మంతి కళ్యాణి(29) అనే మహిళను ఆమె భర్త పాపారావు దారుణంగా హతమార్చాడు. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం దూకలపాడు గ్రామానికి చెందిన కళ్యాణికి లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాపారావుతో 2008 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లయ్యాక వారి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది.



కానీ గత ఏడాది నుంచి పాపారావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ అనుమానంతో భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వీరి మధ్య తగాదాలను గ్రా మ పెద్దలు ఎప్పటికప్పుడు సరిచేసే వారు. ఈ నెల 16న కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో వారం రోజుల కిందట కళ్యాణి కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో గ్రామ పెద్దలు మళ్లీ ఇరువురితో మాట్లాడి ఆమెను భర్త వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత పాపారావు మంచిగానే ఉన్నాడు. కానీ శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి భార్యతో గొడవపడ్డాడు. అదికాస్తా పెద్దదై భార్యపై దాడికి దిగాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గమనించి అక్కడి నుంచి పరారైపోయాడు.



పక్కవారు చెప్పే వరకు..

శనివారం ఉదయం ఎప్పటిలాగానే నిద్ర లేచిన పిల్లలు మనోహర్‌(8), హర్షవర్ధన్‌(6)లు తల్లి ఇంకా నిద్రలేవకపోవడం గమనించి పక్కింటి వారికి చెప్పారు. వారు వచ్చి చూసే సరికి కళ్యాణి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పాతపట్నం సీఐ ప్రకాశరావు, ఏఎస్‌ఐ ఎంఆర్కే రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా నిర్వహించారు. కళ్యాణి తండ్రి  ముద్దాడ జగ్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.



దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

తల్లి హత్యకు గురి కావడం, తండ్రి పరారీలో ఉండడంతో పిల్లలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అక్కడ జరుగుతున్న విషయాలు ఏమీ అర్థం కాక వారు అమాయకంగా అందరి వైపు చూస్తుండడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఆఖరకు తల్లి మృతదేహం పక్కనే ఉన్నా ఆమె చనిపోయిందని తెలుసుకోలేని ఈ చిన్నారులకు ఇప్పుడు దిక్కెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top