పట్టపగలే దారుణం..

పట్టపగలే దారుణం.. - Sakshi


భార్యను హతమార్చిన భర్త

తనతో ఉండొద్దు.. అన్నందుకే కడతేర్చాడు

 అతికిరాతకంగా చేతులు నరికి.. ఆపై గొంతు కోసిన వైనం

పోలీసుల అదుపులో నిందితుడు..?


సూర్యాపేట క్రైం :

మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. తనకు పెళ్లి కాలేదని.. నిన్నే ఇష్టపడుతున్నానంటూ నాలుగు నెలల పాటు వెంటపడ్డాడు. ఆ మహిళ వద్దన్నా.. ఉంటే నీతోనే.. ఉంటా.. లేదా చచ్చిపోతానంటూ ఆమెకు ఇష్టం పెరిగేలా చేశాడు. ఆ మాటలు నమ్మిన మహిళ ఇష్టం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లేలా చేసింది. ఇద్దరి మనస్సులు కలిశాయి. ఇంకేముంది సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ నర్సింహాస్వామి సన్నిధిలో ఒక్కటయ్యారు. పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కొద్దిరోజుల పాటు సజావుగానే సాగింది. కానీ ఇంతలోనే ఊహించని ఘటనలతో ఒకరి జీవితం అర్ధాంతరంగా ముగియగా.. మరొకరి జీవితం కటకటలాపాలైంది.



ఆ ప్రాంతంలో నిత్యం వందలాది మంచి సంచరిస్తుంటారు.. అక్కడే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండడంతో నిమిషం కూడా వ్యవధి లేకుండా ప్రజలు అటు ఇటు తిరుగుతుంటారు. అలాంటిది అందరూ చూస్తుండగానే.. ఓ భర్త భార్యను అతికిరాతకంగా కత్తితో చేతులు నరికి.. ఆపై గొంతు కోసి హతమార్చాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన షేక్‌ సమీరాబేగం అలియాస్‌ సబీనాబేగంను తండ్రి చిన్నప్పుడే వదిలివెళ్లాడు.



దీంతో ఆమె తల్లి గౌసియాబేగం ఒక్కగానొక్క కుమార్తె సబినా బేగాన్ని వెంటపెట్టుకుని ఆరేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉంటున్న ఆమె అక్కబావలు సమ్మద్‌–ఫాతిమాబేగంల వద్దకు వచ్చింది. సూర్యాపేట పట్టణంలోనే ఉంటూ దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రెండేళ్ల క్రితం కుమార్తె సబినాబేగంను ఇల్లందుకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. వివాహమైన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని వేరుగా సూర్యాపేట పట్టణంలోని ఆమె పెద్దమ్మపెదనాన్నల వద్ద ఉంటుంది. సబీనా పట్టణంలోని ఓ షాపింగ్‌మాల్‌లో వర్కర్‌గా పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటుంది. ఈ క్రమంలో శాంతినగర్‌ నుంచి రోజు షాపింగ్‌ మాల్‌కు వెళ్తున్న సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ ధరావత్‌ శ్రీనుతో పరిచయం ఏర్పడింది.



ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో శ్రీను ఆమెను వివాహం చేసుకుంటానని.. తనకు ఇప్పటివరకు పెళ్లి కాలేదని నమ్మబలికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఐదు నెలల పాటు ఇద్దరు కలిసి పట్టణంలోని శ్రీరాంనగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ సమీపంలో అద్దెకు ఓ గదిని తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కానీ శ్రీనుకు అంతకుముందే వివాహం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సబినా.. శ్రీనును నాతో ఉండోద్దూ.. నా వద్దకు రావొద్దంటూ చెప్పింది. దీంతో సబినాబేగం ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని, నన్ను దగ్గరికి రానివ్వడం లేదంటూ భర్తశ్రీను ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో శ్రీను నుంచి దూరం కావాలనుకున్న ఆమె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలోని అద్దె గదిలోని సామగ్రిని తీసుకుని మెట్రో హాస్పిటల్‌ సమీపంలో తీసుకున్న మరో అద్దె గదిలోకి మార్చేందుకు కిరాయికి ఓ ఆటోను తీసుకుంది.


ఆ ఆటోలో సామగ్రి వేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో వేరే ఆటోలో వచ్చిని ఆటోను అడ్డుకుని ఒక్కసారిగా సబినా బేగంపై కత్తితో దాడి చేసి చేతులు నరికి.. గొంతు కోసి అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే చంపి పారిపోయాడు. సబినాను శ్రీను హతమార్చిన విషయాన్ని సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్‌కు సబినా చిన్నమ్మ వహిదాబేగం చేరవేసింది. వెంటనే సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్, సూర్యాపేట రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ ఐలు జానకిరాములు, క్రాంతిలు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబినా బే గం మృతదేహాన్ని ఏరియాస్పత్రికి తరలించారు. మృతురా లి చిన్నమ్మ వహిదాబేగం ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఐదు నిమిషాల్లోనే..

ఐదు నిమిషాల్లోనే సబినాబేగం ప్రాణాలు విడిచింది. శ్రీను తనపై కత్తితో దాడి చేస్తున్నాడంటూ.. ఫోన్‌లో చెబుతూనే ఉంది. నేను అప్పటికే ఘటనకు కూతవేటు దూరంలో ఉన్నాను. సబినా, శ్రీనుల మధ్య ఘర్షణ జరుగుతుండడంతో తెలియక తప్పుచేసిందని శ్రీనుకు వివరించినా సబినా వెంట పడుతూనే ఉన్నాడు. కానీ ఇలా కత్తితో నరికి చంపడం సరికాదు. నిందితుడు శ్రీనును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఘటనా స్థలంలో పోలీసులను వేడుకుంది.

– షేక్‌ వహిదాబేగం, మృతురాలు సబినాబేగం చిన్నమ్మ



వద్దన్నందుకే కడతేర్చాడు..

వివాహం చేసుకున్న తర్వాత కొద్దిరోజులుగా వారి జీవితం సాఫీగానే సాగింది. అయితే శ్రీనుకు అంతకుముందే వివాహం అయిన విషయం సబినాకు తెలియదు. కాగా మూడు నెలల క్రితం విషయం తెలిసింది. దీంతో పలుమార్లు శ్రీనును వివాహమైన విషయం అడిగినా అబద్ధమంటూ చెప్పసాగాడు. ఇటీవలి కాలంలో శ్రీను సెల్‌ఫోన్‌కు ఒక కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌ను సబినా ఎత్తడంతో శ్రీను భార్యను మాట్లాడుతున్నాను.. మీరెవరంటూ దుర్భాషలాడినట్లు బంధువులు తెలిపారు. నీకు పెళ్లయిన విషయం నాకు చెప్పకుండా నన్ను మోసం చేశావని.. ఇక నుంచి నా వద్దకు రావొద్దంటూ చాలాసార్లు చెప్పినా వినిపించుకోలేదు. అయినా సబీనాబేగం వెంటే పడుతూ ఆమెను వేధించసాగుతున్నాడు. తనను కాదని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే వద్దంటున్నావంటూ తరచూ ఘర్షణకు దిగుతున్నాడు.  ఈ క్రమంలో సబినాను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో చేతులు నరికి ఆపై గొంతు కోసి హతమార్చాడు.

డీఎస్పీ సమక్షంలో..

భర్త ధరావత్‌ శ్రీను తనను తీవ్రంగా వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ ఇటీవల సూర్యాపేట డీఎస్పీని ఆశ్రయించింది. సబినా నుంచి ఫిర్యాదును స్వీకరించిన డీఎస్పీ శ్రీనును పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చింది. అయినా అతనిలో మార్పురాకపోవడంతో తిరిగి సబినా మరల డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయితే సబినా, శ్రీనులకు మధ్య ఘర్షణ ముదిరిపోవడంతో ఇక మేం కలిసి ఉండమంటూ ఇరువురు తెలపడంతో బంధువుల సమక్షంలో బాండ్‌పేపర్‌పై శ్రీనుతో ఎలాంటి సంబంధం లేదంటూ రాయించి పంపింనట్లు బంధువులు తెలిపారు. ఇది జరిగిన 24 గంటల్లోనే సబినా హత్యకు గురికావడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top