నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా అరెస్టు

నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా అరెస్టు - Sakshi

► రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లు స్వాధీనం

► మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్‌ ఫోన్  స్వాధీనం  

 

వరంగల్‌: భారత ప్రభుత్వం రద్దు చేసిన నోట్లను కమీషన్ల పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠాను వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను నుంచి రూ.19,52,500 రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీ పూజ వివరాలు వెల్లడించారు.



వరంగల్‌ లేబర్‌ కాలనీకి చెందిన పోలెబాక అంబు అలియాస్‌ కీర్తి, సుబేదారికి చెందిన కందుకూరి సుమన్, పెద్దమ్మగడ్డకు చెందిన కంజర్ల అశోక్‌కుమార్, ఆర్‌ఎన్టీరోడ్‌కు చెందిన ప్రవీణ్, గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన నోముల మల్లికార్జున్, నయీమ్‌నగర్‌కు చెందిన కొండ వెంకటేశ్వర్లు, మడికొండకు చెందిన పసుకుల మౌళి అలియాస్‌ నాని, ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన అరకుల మహేందర్‌ కలిసి రద్దయిన నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్నారని చెప్పారు. పోలెపాక అంబు అలియాస్‌ కీర్తి వరంగల్‌ లేబర్‌ కాలనీలో అభయ ఫౌండేషన్ నెలకొల్పింది. ఈ ఫౌండేషన్ చాటున విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రణాళికలను వేస్తుండేది.



ఈక్రమంలో 2014 సంవత్సరంలో అభయ స్వయం సేవక సంఘం పేరుతో మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ల వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేసి తిరిగి వారికే రుణాల రూపంలో డబ్బు ఇచ్చేది. ఈ సమయంలో వెయ్యి, ఐదు వందల నోట్లు రద్దు అయ్యాయి. కొద్ది మొత్తంలో రద్దయిన నోట్లను అంబు మార్పిడి చేసింది. ఆ దశలో అంబుకు సుమన్, అశోక్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. రద్దయిన నోట్లను పెద్ద మొత్తంలో కమీషన్ రూపంలో మార్పిడికి చేయడం ద్వారా వచ్చే డబ్బును అందరం పంచుకోవచ్చని అంబు నిందితులైన సుమన్, అశోక్‌కుమార్‌లకు తెలిపింది. ఈ ఇద్దరి సూచన మేరకు మిగితా నిందితులైన మల్లికార్జున్  రూ.9,88,000, ప్రవీణ్‌ రూ.8,87,500, వెంకటేశ్వర్లు రూ.77 వేలు రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్ల సమకూర్చుకున్నారు.  



ఈ నోట్లను ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో అంబు ఇంటికి వచ్చారు. పక్కా సమాచారం రావడంతో సీసీఎస్‌ ఇన్స్పెక్టర్‌ డేవిడ్‌రాజు సిబ్బందితో కలిసి అంబు ఇంటికి వెళ్లి సోదా చేశారు. రద్దయిన నోట్లు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏసీపీ పూజ వెల్లడించారు. కాగా, రద్దయిన నోట్లను మార్పిడి చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చేసిన క్రైం ఏసీపీ పూజ, సీసీఎస్‌ ఇన్స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్, సబ్‌ ఇన్స్పెక్టర్‌ సుభ్రమణేశ్వరరావు, ఏఎస్‌ఐ సంజీవరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శోభారాణి, స్వప్న, శ్రీనివాస్‌రాజు, కానిస్టేబుల్‌ మహమ్మద్‌అలీ(మున్నా), రవికుమార్, జంపయ్యలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుదీర్‌బాబు అభినందించారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top