93.01% జనాభా గ్రామాల్లోనే..


రాష్ట్ర సగటు కంటే ఎక్కువ..

సింహభాగం వ్యవసాయమే జీవనాధారం

రైతులు, వ్యవసాయ కూలీలే అధికం

 ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరం




హన్మకొండ : గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నది అందరికీ తెలిసిందే. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో అభివృద్ధి పనులు, గ్రామీణుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతూ పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నాయి. అయితే, రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన వరంగల్‌ రూరల్‌ జిల్లా విషయానికొస్తే పేరుకు తగినట్లుగానే సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం విశేషం. ఈ జిల్లాలో 93.01 శాతం జనాభా గ్రామీణులే కాగా.. కేవలం 6.99 శాతమే అర్బన్‌ జనాభా ఉంది. దీంతో ఈ జిల్లాలో గ్రామాలు, గ్రామీణుల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.



రాష్ట్రంలో 61.12 శాతం

రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గ్రామీణ జనాభా 61.12శాతం, పట్టణ జనాభా 38.88శాతం ఉంది. అయితే, వరంగల్‌ రూరల్‌ జిల్లా విషయానికొస్తే 93.01శాతం మంది గ్రామాల్లో నివసిస్తుండగా.., 6.99శాతం జనాభా మాత్రమే పట్టణాల్లో నివసిస్తోంది. జనసాంద్రత విషయంలోనూ  రాష్ట్రంలో చదరపు కిలోమీటరుకు 312మంది ఉండగా, ఇక్కడ 330మంది జనాభా ఉన్నారు. అంటే గ్రామీణ జనాభా, జనసాంద్రత రాష్ట్రంతో పోలిస్తే వరంగల్‌ రూరల్‌ జిల్లాలోనే ఎక్కువ. అలాగే, అక్షరాస్యత విషయానికొస్తే రాష్ట్రంలో 66.54శాతం ఉండగా, ఇక్కడ 61.26శాతమే ఉంది. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతుండగా 98,880మంది వ్యవసాయదారులు, 2,00,721మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. అంటే దాదాపు 45శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. దీంతో జిల్లాలో గ్రామీణాభివృద్ధి, అక్షరాస్యత శాతం పెంపుపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.



నిధులు సాధిస్తే..

గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాల పరంగా చూస్తే వరంగల్‌ రూరల్‌ జి ల్లా దేశంలోనే ముందువరుసలో ఉంటుంది. ఇలాంటి జిల్లాలో గ్రామీణ ప్రాంతా లు, గ్రామీణ జనాభాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తేనే సాధ్యపడుతుంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి కేంద్రప్రభుత్వం ద్వారా గణనీయంగా నిధులు సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నగదురహిత లావాదేవీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ జనాభా అధికంగా ఉన్న వరంగల్‌ రూరల్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పల్లె ప్రజల కష్టాలు తీర్చినట్లవుతుంది.

తిరుమల వెళ్లిన భజనమండలి సభ్యులు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top