87.58శాతం

87.58శాతం - Sakshi


► మందకొడిగా సాగిన పోలింగ్‌

► ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతం

► ఫొటోల తారుమారుపై తీవ్ర నిరసన

► హయత్‌నగర్‌లో ఒకరికి బదులు మరొకరు ఓటేసిన వైనం




సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 87.58శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో పదుల సంఖ్యలోనే ఓటర్లు ఉండడంతో సందడి కనిపించలేదు.


అయినా ఓటర్లు ఒక్కొక్కరుగా సాయంత్రం 6 గంటల వరకు వెళ్లి తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మరోపక్క హయత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఒకరికి బదులుగా మరొకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయడానికి వచ్చిన అసలు ఓటరు దానిని గుర్తించి అసహనానికి గురయ్యారు. పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు కూడా గుర్తించలేకపోయారు.



ఆందోళనలు...

బ్యాలెట్‌ పేపర్‌పై టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి, మరో అభ్యర్థి ఆది లక్ష్మయ్మ ఫొటోలు తారుమారు కావడం పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమైంది. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ కుట్రపూరిత చర్యలతోనే ఘోర తప్పిదం జరిగిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు.


ఈ తప్పదాన్ని ఉదయమే గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు నేతలు. అయితే పోలింగ్‌ రద్దు ప్రకటన సాయంత్రం వరకూ వెలువడకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు రద్దు ప్రకటన రావడం, రీపోలింగ్‌ని ఈ నెల 19న నిర్వహిస్తామనడం పట్ల కాస్త ఉపశమనం లభించింది. ఫొటోల తారుమారుకు కారకులైన వారిపై కఠిన

చర్యలు తీసుకోవాలని నేతలు, ఓటర్లు డిమాండ్‌ చేశారు.


పోలింగ్‌ సరళి ఇలా..

సమయం(గంటలు)        పోలింగ్‌ శాతం

ఉదయం   10                   23.3

ఉదయం  12                    50.35

మధ్యాహ్నం  2                 68.70

సాయంత్రం  4                    80.85

సాయంత్రం   6                    87.58

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top