8న బతుకమ్మ మహాప్రదర్శన

8న బతుకమ్మ మహాప్రదర్శన


భారీ ఏర్పాట్లు చేయండి

గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించాలి

మంత్రి అజ్మీరా చందూలాల్‌ ఆదేశం

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌




సంగారెడ్డి జోన్‌: బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్టోబర్‌ 8న అన్ని జిల్లాల్లో బతుకమ్మ çమహా ప్రదర్శనను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి ఆ శాఖ  కార్యదర్శి బి.వెంకటేశం, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌తో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాలు శుక్రవారం మొదలైనట్టు చెప్పారు. 8వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎనిమిది వేల మంది మహిళలతో బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్‌ బుక్‌లో స్థానం లభించేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించి అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

హైదరాబాద్‌ తరహాలోనే జిల్లాల్లోనూ 8వ తేదీన మహా ప్రదర్శనను వెయ్యి మంది మహిళలకు తక్కువ కాకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణలో పుట్టిన పూల పండగకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలన్న ధ్రుడ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. 9న సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఊరూరా ఏర్పాట్లు చేయాలన్నారు. నీటితో చెరువులు నిండినందున భారీ క్రేన్లు, లైటింగ్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇందుకోసం పాత జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, కొత్త జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు కలెక్టర్లకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మహా ప్రదర్శన, సద్దుల బతుకమ్మ, ఇతర సంబరాలు ఘనంగా నిర్వహించటంలో విశేషంగా కృషి చేసిన జిల్లాలకు నగదు పారితోషికం అందజేస్తామని వెల్లడించారు.


మొదటి బహుమతి కింద రూ. 5 లక్షలు, రెండో బహుమతి కింద రూ.3 లక్షలు, మూడో బహుమతి కింద రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా తరఫున కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రామిరెడ్డి  మాట్లాడుతూ.. జిల్లాలో 8, 9వ తేదీల్లో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కలెక్టరేట్‌ నుంచి డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ మోతె, సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారలు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top