అ ఆ అక్షరాలు నేర్పేదెవరు..!

అ ఆ అక్షరాలు నేర్పేదెవరు..! - Sakshi


అంగన్‌వాడీ స్కూళ్లలో ఆయాలే దిక్కు

జిల్లాలో 908 కేంద్రాలు 50 మంది టీచర్లు,

77 ఆయా పోస్టులు ఖాళీ

పౌష్టికాహారం, ఆట పాటలకు దూరమవుతున్న చిన్నారులు

తగ్గిపోతున్న పిల్లల హాజరు శాతం

ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు






అంగన్‌వాడీ స్కూళ్లను టీచర్ల కొరత వేదిస్తోంది. అక్షరాలు నేర్పేవారు లేకపోవడంతో పిల్లలకు ఆయాలే దిక్కయ్యారు. ఆట పాటలు నేర్పడంతో పాటు పౌష్టికాహారాన్ని వారే అందిస్తున్నారు. అంగన్‌వాడీ స్కూళ్లలో ప్లేవే విద్య బోధిస్తామని చెబుతు న్న ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



సాక్షి, వరంగల్‌ రూరల్‌ :

జిల్లా వ్యాప్తంగా 908 అంగన్‌వాడీ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 50 మంది టీచర్లు, 77 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు లేని చోట ఆయాలే చిన్నారుల ఆలన పాలన చూసుకుంటున్నారు. పిల్లలకు వంట చేసి పౌష్టికాహారం అందిస్తునే పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారికి అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. 5 సంవత్సరాల వయస్సు వచ్చినా పిల్లలకు పాటలు, అక్షరాలు రావడం లేదని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ గురించి చెప్పే వారు లేకుండా పోయారు. దీంతో బాలింతలు, గర్భిణులు కేవలం పప్పు, కోడిగుడ్లు తీసుకునేందుకే కేంద్రాలకు వస్తున్నారు.



ఆయాలు లేని చోట చిన్నారులకు పౌష్టికాహారం సమయానికి అందించడంలో టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతో చిన్నారులను పంపించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఫలితంగా రోజురోజుకూ హాజరు శాతం తగ్గిపోతోంది. శాయంపేట మండలం ఎస్సీ కాలనీ నాలుగో నంబర్‌ కేంద్రానికి చెందిన టీచర్‌ ఏడు సంవత్సరాల క్రితం చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆయాతోనే కొనసాగిస్తున్నారు. అదే మండల కేంద్రంలోని ఒకటి, ఎనిమిదో నంబర్‌ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు పదోన్నతిపై వెళ్లడంతో మూడేళ్లుగా ఆయాల సంరక్షణలోనే నడుస్తున్నాయి.



ఫిర్యాదు చేసినా..

అంగన్‌వాడీ స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతో అక్షరాలు నేర్పడం లేదని వెంటనే పోస్టులు భర్తీ చేయాలని పలుమార్లు గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న టీచర్ల, ఆయా సిబ్బందిని  నియామించాలని కోరుతున్నారు.



పూర్తి స్థాయిలో రిపోర్ట్‌ తెప్పించుకుంటున్నాం

సీడీపీఓల నుంచి పూర్తి స్థాయిలో రిపోర్ట్‌ తెప్పించుకుంటున్నాం. ఖాళీల వివరాలు రాగానే కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం. త్వరలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top