ప్రతీ శాఖ స్వయం సమృద్ధి సాధించాలి

ప్రతీ శాఖ స్వయం సమృద్ధి సాధించాలి - Sakshi


ఏడు మిషన్ల పురోగతిపై ప్రతీ 45 రోజులకు సమీక్ష

బడ్జెట్‌ అంచనాల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు




సాక్షి, అమరావతి: 2017–18 సంవత్సరానికి వాస్తవ అంచనాలు, లక్ష్యాల ఆధారంగా  ఫలిత ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏడు మిషన్ల పురోగతిపై ఇక నుంచి ప్రతీ 45 రోజులకు ఒకసారి సమీక్ష చేస్తానన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు మిషన్ల లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ వచ్చే బడ్జెట్‌లో అంచనాలు రూపొందించుకోవాలని ఆయా శాఖాధిపతులకు ముఖ్యమంత్రి సూచించారు. గురువారం సచివాలయంలో బడ్జెట్‌ అంచనాల సమీక్షలో భాగంగా ఏడు మిషన్ల ప్రగతిపై ఆయా శాఖాధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్‌ ఆర్థికలోటులో ఉన్నప్పటికీ దీనితో సంబంధం లేకుండా ఆయా శాఖలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆదాయావనరులు పెంచుకోవాలన్నారు. ప్రతీ శాఖను ఈ ప్రగతితో అనుసంధానం చేయడం ద్వారా జవాబుదారీతనం పెంచనున్నట్లు తెలిపారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ హాజరు, సెన్సార్లు, సర్వేలెన్స్‌ కెమెరాలు అమర్చాలని ఆధికారులను ఆదేశించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అక్ష్యరాస్యత, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో వెనుకబడి ఉండటానికి అధికారులే కారణమన్నారు.



108 ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు ప్రారంభించిన సీఎం

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో ఉన్న అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఎఎల్‌ఎస్‌) 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అయితే, అంబులెన్స్‌లో ప్రధానంగా ఉండాల్సిన  ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌) పరికరాలను అమర్చకుండానే సీఎం వాటిని ప్రారంభించేశారు. 18 వాహనాలను ప్రారంభించగా.. అందులో 12 వాహనాల్లో ఏఎల్‌ఎస్‌ లేదు. 108 అంబులెన్సులను ఆదరాబాదరాగా సచివాలయానికి తెచ్చిన అధికారులు ప్రారంభోత్సవం పూర్తికాగానే వాటిని తిరిగి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top