నత్తలే నయం


ఆరోగ్య రాజధాని హైదరాబాద్‌లో పలు ఆసుపత్రులు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు పోటీ పడుతున్నాయి. రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ, అత్యు త్తమ ప్రమాణాలతో ముందుకు పోతున్నాయి. ఇప్పటి వరకు నగరంలో 30 కార్పొరేట్‌ ఆస్పత్రులకు నేషనల్‌ అక్రిడేషన్‌ ఫర్‌ హాస్పిటల్‌ బోర్డ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవిడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు పొందగా, మరో మూడు చిన్న ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఈ గుర్తింపు పొందిన ఆస్పత్రుల జాబితాలో ఢిల్లీ ఆస్పత్రులు తొలిస్థానంలో ఉండగా, హైదరాబాద్‌లోని ఆస్పత్రులు రెండో స్థానంలో ఉండటం గమ నార్హం. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ విషయంలో దూసుకుపోతుంటే, మన ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఈ విషయంలో ఘోరంగా వెనుకబడి పోవడం విశేషం.



సాక్షి, సిటీబ్యూరో: ‘నగరంలో ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆస్పత్రులు 15 వరకు ఉండగా, మరో 75 ఏరియా, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 3 ఆస్పత్రులు మాత్రమే నేషనల్‌ అక్రిడిటేషన్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ బోర్డ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవిడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌)గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆయా ఆస్పత్రుల్లోని మౌలిక వసతులు, వైద్యసేవలు, పేషంట్‌కేర్, తదితర సేవలు అధ్వాన్నంగా ఉండటంతో వాటిలో వేటికీ గుర్తింపు ఇవ్వలేదు. భవిష్యత్తు లో వస్తుందనే నమ్మకం కూడా లేదు’ ప్రభుత్వ ఆస్పత్రులపై సాక్షాత్తూ ఎన్‌ఏబీహెచ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గిరిధర్‌.జె.జ్ఞానీ ఇటీవల వెల్లడించిన అభిప్రాయం ఇది. ఈ ఒక్క విమర్శ చాలు మన ఆస్పత్రుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. క్లిష్టమైన జబ్బులను సైతం క్షణంలో నయం చేయగలిగే వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ..రోగులకు అందుతున్న సేవలు మాత్రం అధ్వాన్నంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



పేరు ఘనం...సేవలు అధ్వాన్నంః

‘గ్రేటర్‌’లో చారిత్రక ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో కనీసం సరిపడా పడక లే కాదు.. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వార్డుల్లోకి తరలించేందుకు అవసరమైన స్టచర్లు కూడా లేవు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగుల ప్రాణాలు కాపాడే వెంటిలేటర్లు, డయాలసిస్‌ యంత్రాలు, మందులు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గాంధీలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. గైనిక్‌ వార్డులో ఇన్‌ఫెక్షన్‌ వల్ల చిన్నారులు మత్యువాత పడుతున్నారు. ఓపీకి వచ్చిన నిరుపేద రోగులకు కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఇక చిన్నపిల్లలకు పెద్దదిక్కుగా నిలిచిన నిలోఫర్‌లో పిల్లల నిష్పత్తికి తగిన బెడ్స్‌ లేక పోవడంతో ఒకే బెడ్‌పై ముగ్గురు నుంచి నలుగురు చిన్నారులకు వైద్యం అందించాల్సి వస్తోంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలా ప్రతి రోజూ ఇక్కడ సుమారు పదిమంది చిన్నారులు చనిపోతున్నారు. ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. నిమ్స్‌లో బెడ్‌ దొరకడమే గగణమై పోయింది. ఆపదలో ఉన్న వారు సైతం ఐదారు గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది. పాతబస్తీలోని యునానీ, సుల్తాన్‌బజార్, కింగ్‌జార్టీ ప్రసూతి ఆస్పత్రుల్లోనూ గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి, చివరి నిమిషంలో ఇక్కడికి చేరుకున్న వారిని కనీసం కనికరం లేకుండా బయటికి గెంటేస్తుండటం కొసమెరుపు.



భవిష్యత్తులోనూ అనుమానమే:

రాష్ట్రంలోనే అతిపెద్ద రిఫరల్‌ సెంటర్లుగా గుర్తింపు పొందిన ఈ ఆస్పత్రుల్లో ప్రపంచం గర్వించదగ్గ నిపుణులు ఉన్నప్పటికీ..వారి సేవలకు తగిన గుర్తింపును తెచ్చిపెట్టేవారు లేకపోవడం విచారకరం. పోటీ ప్రపంచంలో ఏ సంస్థ అయినా భవిష్యత్తులో తన మనుగడ సాగించాలంటే..అత్యున్నత ప్రమాణాలు గల ఎన్‌ఏబీహెచ్, ఎన్‌ఏబీఎల్, ఐఎస్‌ఓల గుర్తింపు తప్పని సరిగా మారింది. నగరంలో ఐదు వేలకుపైగా ప్రైవేటు ఆస్పత్రులున్నప్పటికీ, ఇప్పటి వరకు ఆరు కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే ఈ గుర్తింపు లభించింది. ఇందు కోసం ప్రైవేటు ఆస్పత్రులు ఓ వైపు విస్త్రతంగా పోటీ పడుతుంటే..ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అధికారులు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయక పోవడం విచారకరం. మౌలిక వసతులు, వైద్య సేవలు, పేషంట్‌ కేర్, తదితర అంశాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తయారు చేయాలని రోగులు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top