ప్రాణం తీసిన బైక్‌ సరదా..

ప్రాణం తీసిన బైక్‌ సరదా.. - Sakshi


అదుపు తప్పిన బైక్‌

కాలువలో బోల్తాకొట్టి చెట్టును ఢీకొన్న వైనం

విషాదంలో తాండ్రంగి, కొట్టాం గ్రామస్తులు
    



జామి(విజయనగరం): బైక్‌ను స్నేహితుని వద్ద తీసుకున్నారు.. ముగ్గురు విద్యార్థులు కలిసి సరదాగా బయలు దేరారు.. వేగంగా ప్రయాణం సాగించారు. స్వగ్రామాలకు తిరిగి వస్తూ బైక్‌ను అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి మృత్యుకౌగిలికి చేరుకున్న విషాద ఘటన జామి మండంలో ఆదివారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జామి మండలం తాండ్రంగికి చెందిన  విజినిగిరి లక్ష్మణ(13), ఎస్‌.కోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన నిమ్మగొప్పల నాగమజ్జి(16), బుత్తల కోట (12)లు ముగ్గురు స్నేహితులు. బైక్‌పై జామి మండల కేంద్రానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా విజినిగిరి- తాండ్రంగి గ్రామాల మధ్యన ఉన్న రాంబాబు కళ్లాం వద్ద బైక్‌ను అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న కాల్వలో దించి సమీపంలోని చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌.కోట ఇన్‌చార్జి సీఐ రఘుశ్రీనివాస్‌, జామి ఎస్‌.ఐ ఎస్‌.రాజులు పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు.



మిన్నంటిన రోదనలు..

ముగ్గురు విద్యార్థులు ఒకే సారి మరణించడంతో రోదనలు మిన్నంటాయి. తాండ్రంగి గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మమ్మ దంపతులు చిన్నకుమారుడు విజినిగిరి లక్ష్మణ్‌. ఇద్దరు కవలల్లో ఇతను చిన్నవాడు. కొట్టాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొట్టాం గ్రామానికి చెందిన నాగరాజు, ముత్యమ్మల పెద్దకుమారుడు నిమ్మ గోపలనాగమజ్జి ఎస్‌.కోట వివేకానంద జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అందివచ్చిన కొడుకు అందనిలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు బుత్తలకోట కొట్టాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బైక్‌పై సరదాగా వెళ్లి మృతిచెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలపై పడి విలపించిన తీరు అక్కడివారిని కన్నీరు పెట్టించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top