ఉలిక్కిపడిన ఉద్దానం

ఉలిక్కిపడిన  ఉద్దానం - Sakshi


 ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతమైన మల్కన్‌గిరి, రాయ్‌గడ జిల్లాల మధ్య ఆదివారం అర్ధరాత్రి తుపాకుల మోతతో దద్దరిల్లింది. తెల్లవారేసరికి ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 24 మందిలో ముగ్గురు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న అలియాస్ సురేష్, అతని భార్య రీజినల్ కమిటీ జననాట్యమండలి సభ్యురాలు బొడ్డు కుందనాలు అలియాస్ సునీత అలియాస్ మమత, సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడు మెట్టూరి జోగారావు అలియాస్ కోటీశ్వరరావు ఉద్దానం ప్రాంతం వారే. అంతేకాదు అదే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు అగ్రనేతలు ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ సుధా అలియాస్ చలపతి, కృష్ణప్ప అలియాస్ దయాలకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలోనున్న సూరన్న, మమత, కోటీశ్వరరావు కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. మృతదేహాలను గుర్తించేందుకు వారు మల్కన్‌గిరికి బయల్దేరి వెళ్లారు.

 

 - ఆందోళనలో కుటుంబ సభ్యులు

 వంగర: ఒడిశాలో జరిగి ఎన్‌కౌంటర్‌లో వంగర మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ దొంతల సతీష్ గాయపడ్డాడు. మావోయిస్టులు-పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సతీష్ కాలులోకి బుల్లెట్ చొచ్చుకుపోయి గాయపడినట్టు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న అతని కుటుబం సభ్యులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సతీష్‌ను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు దొంతల రామారావు, కళావతిలు పోలీసుల సహకారంతో అక్కడకు వెళ్లారు.నాలుగేళ్లు క్రితం సతీష్ పోలీసు ఉద్యోగంలో చేరారు. ఈయన తండ్రి రామారావు సిల్వర్ సామగ్రి విక్రయాలు చేస్తుంటారు. తల్లి ఇంటి వద్ద పనులు చూసుకుంటారు. ఇద్దరు చెల్లెళ్లు హేమలత, స్వాతిలు స్థానికంగా చదువుతున్నారు. వంగర ఎస్సై వై.మధుసూదనరావు, ఏఎస్‌ఐ హెచ్.కాంతారావు అరసాడ గ్రామానికి వచ్చి సతీష్ కుటుంబీకులతో మాట్లాడారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top