క్షణాల్లో పెనువిషాదం!

క్షణాల్లో పెనువిషాదం! - Sakshi


ఏర్పేడులో మరణ మృదంగం

వల్లకాడైన మునగలపాలెం




తిరుపతి/ఏర్పేడు : ఏర్పేడులో మరణ మృదంగం మోగింది. కన్నుమూసి తెరిచేలోగా 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హాహాకారాలు, ఏడుపులు, రోదనలు మిన్నంటాయి. రక్తపు మడుగులో తడిసి ముద్దయిన అభాగ్యులు కొందరైతే, మాంసపు ముద్దలుగా మారి విగతజీవులైన వారు మరికొందరు. ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌ ముందు శుక్రవారం భయానక వాతావరణం నెలకొంది. మృత్యువులా దూసుకొచ్చిన లారీ  రైతులు, వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంది.



పచ్చని పల్లెలో కన్నీటి సుడులు

మునగలపాలెం...పచ్చని పల్లెటూరు. పాడి పంటలకు కొదవ లేని ఊరు. అందరూ అనుభవం ఉన్న రైతులే. ఒక్కటే సమస్య. ఇసుక మాఫియా. అధికార పార్టీ అండదండలతో అధికారులకు మామూళ్లు సమర్పించే ఇసుకాసురులే గ్రామస్తుల పాలిట శాపంగా తయారయ్యారు. వీరి ఆగడాలు అడ్డుకుని, స్వర్ణముఖిలో ఇసుక దోపిడీని అరికట్టాలన్న గ్రామస్తుల నివేదనను పట్టించుకునే అధికారులే లేకుండా పోయారు. కడుపు మండిన బాధిత రైతులు చేతులు కలిపారు. సమస్యపై ఉద్యమించేందుకు సమాయత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పేడు చేరుకుని ధర్నాకు సిద్ధమయ్యారు. పోలీస్‌స్టేషన్‌ తనిఖీకి వచ్చిన ఎస్పీ జయలక్ష్మికి విషయాన్ని వివరించి, ఇంటి ముఖం పట్టాల్సిన రైతులను ఒక్కసారిగా మృత్యువు రూపంలో వచ్చిన లారీ కబళించింది. ఈ  దుర్ఘటనలో 15 మంది దుర్మరణం పాల య్యారు. ఈ హఠాత్పరిణామానికి మునగలపాలెం గొల్లుమంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వారే ఎక్కువ. పోస్ట్‌మార్టం పూర్తయి రాత్రి 9 గంటలకు ఊరు చేరిన శవాలను చూసి వీధివీధినా రోదనలే. ఉదయం హుషారుగా వెళ్లి రాత్రికి విగతజీవుౖలై తిరిగొచ్చిన తండ్రులను చూసి బిడ్డలు కంటికి కడివెడై విలపించారు.



మృతుల కుటుంబాలకురూ.5 లక్షలు

తిరుపతి రుయా ఆస్పత్రిని సందర్భించిన కలెక్టర్‌ ప్రద్యుమ్న మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ అధికారులు, రుయా, స్విమ్స్‌ ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కలెక్టర్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top