భూ... బాగోతం

భూ... బాగోతం - Sakshi


కాకినాడలో రూ.3 కోట్లు విలువైన 2 వేల చదరపు గజాలు

తెలుగు తమ్ముళ్ల కబ్జాల పర్వం

జగన్నాథపురం సత్యవతి కాలనీలో అన్యాక్రాంతం

చెరువు స్థలం ఆక్రమించినా పట్టించుకోని అధికారులు

కాకినాడ నగర ఎమ్మెల్యే అనుచరుల ధాష్టీకమిదీ...




కాకినాడ: మున్సిపాల్టీలో అధికార పార్టీ అనుచరులదే హవా... ఎమ్మెల్యే అండ చూసుకొని దండుకోవడమే కాకుండా దౌర్జన్య కాండకు పాల్పడి ఆక్రమణలకు దిగడంతో అర్హులు అల్లాడిపోతున్నారు. ఈ అక్రమాలకు ఓటుతో ఎక్కడ బుద్ధి చెబుతారోనని భయం కూడా లేకుండా పోయింది.



అధికార దాహం అర్హులైన పేదల భూములను మింగేస్తోంది. పేదలకు ఇవ్వాల్సిన పట్టా భూములు అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణల చెరలో చిక్కుకున్నాయి. స్థానిక శాసన సభ్యుని అండదండలు వారికి పుష్కలంగా ఉండటంతో అడ్డాకు అదుపులేకుండాపోతోంది. కోట్ల విలువైన భూమిని పేదలకు పంచకుండా తెలుగు తమ్ముళ్లు వాటాలు వేసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. అదేమిటని అడిగితే దౌర్జన్యానికి వెనుకాడటం లేదు. కాకినాడలోని జగన్నా«థపురం మహాలక్ష్మీనగర్‌ మేకల కబేళాను ఆనుకుని ఉన్న స్థలాన్ని తెలుగు తమ్ముళ్లు ఓ మహిళను అడ్డుపెట్టుకుని ఆడుతున్న భూ బాగోతమిదీ.



20వ డివిజన్‌ జగన్నాధపురంలోని సత్యవతి కాలనీలో సుమారు 2 వేల చదరపు గజాల స్థలంలో చెరువు గర్భం విస్తరించి ఉంది. ఆ స్థలాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కళావంతులకు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే స్థలాల పంపిణీలో జాప్యం జరగడంతో కళావంతులు అక్కడి నుంచి తరలిపోయారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను ఆ స్థలంపై పడింది. పల్లపు ప్రాంతంగా ఉన్న ఈ స్థలాన్ని మెరక చేయించారు. స్థలం చుట్టూ సరిహద్దులు నిర్ణయించి కాపలాదారులను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన టీడీపీ కార్యకర్తలను పిలిచి... ఇది మనదే ఇళ్లు నిర్మించుకోండని హామీ ఇచ్చారు.



ఒక్కో కార్యకర్తకు 30 నుంచి 40 చదరపు గజాల స్థలాన్ని పంపిణీ చేశారు. అంతేకాకుండా తాత్కాలికంగా రహదారులు నిర్మించారు. ఒకొక్కరి నుంచి రూ.40 వేల నుంచి 70 వేల వసూలు చేసినట్టు సమాచారం. దాదాపు 70 మంది నుంచి ఈ మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. నేతల హామీలను నమ్మి కార్యకర్తలు, సొమ్ములిచ్చిన ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 15 ఇళ్లు నిర్మించగా మరో ఆరు ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. భరోసాగా నిలిచిన మహిళ మాత్రం దాదాపు 100 చదరపు గజాల స్థలంలో పక్కా భవనాన్ని నిర్మించుకున్నారు.



సుప్రీం కోర్టు ఉత్తర్వులూ...బేఖాతరు...

చెరువులు, కుంటల్లో  ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో ఘోషిస్తోంది. అయితే ఈ చెరువు స్థలాన్ని అక్కడి టీడీపీ కార్యకర్తలు ఆక్రమించి నిర్మాణాలు చేసుకుంటున్నా, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొంతమంది నుంచి ఇళ్ల  పన్నును మున్సిపల్‌ శాఖ వసూలు చేస్తే... దాన్ని ఆధారం చేసుకుని విద్యుత్తు కనెక్షన్‌ను తీసుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి రెవెన్యూశాఖ కాకినాడ, రూరల్‌ ప్రాంతంలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయలేదు. అయినా అక్కడి నిర్మాణాల వైపు ఈ శాఖల అధికారులెవరూ పట్టించుకోకపోవడం విశేషం.



రూ. 3 కోట్ల విలువైన స్థలం...

పెన్షనర్స్‌ పేరడైజ్‌గా భావిస్తున్న కాకినాడలో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఇక్కడ చదరపు గజం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నా రు. దాదాపు రూ.3 కోట్ల విలువైన ఆ స్థలాన్ని ఎమ్మెల్యే ఆదేశాలు, సూచనల మేరకు అక్కడి టీడీపీ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై తహసీల్దారును వివరణ కోరగా...రెండు సంవత్సరాల నుంచి కాకినాడ, రూరల్‌ పరిధిలో నిరుపేదలకు పట్టాలు ఇవ్వలేదని, ఎక్కడా స్థలాలు పంపిణీ చేయలేదన్నారు. ఈ స్థలం విషయమై వివరణ కోరగా తనకా విషయం తెలియదన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top