ఆ బంగారం దొరికింది...

ఆ బంగారం దొరికింది...


జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీకి గురైన 1,700 గ్రాముల బంగారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో దొరికింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన బంగారం వ్యాపారి సుందర్ అయ్యర్‌స్వామి పద్మనాభన్ రెగ్జిన్ క్లాత్ సంచిలో ఆ బంగారాన్ని తీసుకుని గురువారం ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్కగా చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.  ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బి.జయలక్ష్మి తన కుమార్తెతో స్వగ్రామమైన నల్లజర్ల వెళ్లేందుకు కంట్రోల్ రూమ్ వద్ద శుక్రవారం కూర్చుని ఉండగా సుమారు 50 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి సంచి తీసుకొచ్చి అది బస్సులో దొరికిందని ఆమెకు అప్పగించి వెళ్లిపోయాడు.  జయలక్ష్మి ఆ సంచిని మొదటి అంతస్తులో ఉన్న డిపో క్లర్క్‌కు అప్పగించేందుకు తీసుకువెళ్లింది. అదే సమయంలో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఒక వ్యక్తి ఫోన్‌చేసి తనపేరు రాజేష్ అని, ఇంటర్మీడియెట్ చదువుతున్నానని చెప్పాడు. బస్టాండ్‌లో పోయిన బంగారం దొరికిందని, ఒక మహిళ ఆ సంచి తీసుకుని డిపోపైన ఉన్న కార్యాలయానికి వెళుతోందని సమాచారం ఇచ్చారు.

 

 ఈ విషయాన్ని ఏఎస్సై రామచంద్రరావు ఎస్సై ఎ.ఆనందరెడ్డికి తెలియజేశారు. వెంటనే ఎస్సై, ఏఎస్సై  బస్ డిపోకు చేరుకున్నారు. జయలక్ష్మి డిపో మొదటి అంతస్తు మెట్లు ఎక్కుతుండగా ఎస్సై, ఏఎస్సై ఆమెను ఆపి ఆమె వద్ద ఉన్న సంచిని పరిశీలించారు. అందులో బంగారం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను డీఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు.  డీఎస్పీ జె.వెంకటరావు బంగారాన్ని పరిశీలించి జయలక్ష్మి నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేశారు. ఈ విషయమై డీఎస్పీని విలేకరులు వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. పూర్తి వివరాలు సేకరించలేదని, దర్యాప్తు పూర్తై తరువాత వివరాలు చెబుతామని అన్నారు.  బంగారం వ్యాపారి సుందర అయ్యర్‌స్వామి పద్మనాభన్ 1700 గ్రాములు బంగారం పోయిందని ఫిర్యాదు చేయగా, పోలీసులు మాత్రం 170 గ్రాములు మాత్రమే పోయినట్టు కేసు నమోదు చేశారు. శుక్రవారం దొరికిన బంగారం సుమారు 1700 గ్రాములు ఉంటుందని చెబుతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top