కాపులపై సెక్షన్‌ 144 కత్తి


ఏలూరు (మెట్రో) : కాపుల ఉద్యమంపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించి కాపుల పోరా టాన్ని అణచివేసేందుకు యత్నించింది. అప్పట్లో టీడీపీ నాయకులు నిర్వహించిన జనచైతన్య యాత్రలకు మాత్రం అనుమతి ఇచ్చింది. తాజాగా, మరోమారు ఆ సామాజిక వర్గం వారిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 25వ తేదీన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 30వ తేదీ వరకూ కొనసాగే ఈ యాత్ర అంతర్వేది చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోనూ కాపులు ఎటువంటి సభలు పెట్టకూడదంటూ నిషేధాజ్ఞలు విధిం చింది. మంగళవారం నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ ప్రకటించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 144 సెక్షన్‌ ప్రకారం.. ఐదుగురికి మించి గుంపులుగా తిరగకూడదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల అమలుకు జిల్లా పోలీస్‌ అధికారులతో ప్రజలు సహకరించాలని కోరారు.

 

రేపు చలో రావులపాలెం

ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల కాపు సంఘాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. ముద్రగడకు సంఘీభావంగా కాపులంతా రావులపాలెం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లానుంచి తరలివెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని పోలీస్‌ యంత్రాగానికి ఆదేశాలు అందాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు పాదయాత్రకు వెళ్లకుండా కాపు వర్గాలను అడ్డుకోవాలని సూచనలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచే నిషేధాజ్ఞలు అమలు చేసేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమైంది.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top