1,258 కిలోల గంజాయి స్వాధీనం

1,258 కిలోల గంజాయి స్వాధీనం

కంటైనర్‌లో తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు 

రాజానగరం : జాతీయ రహదారిపై భారీస్థాయిలో తరలిస్తున్న గంజాయిని రాజానగరం సీఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలో లభ్యమైన గంజాయి కంటే రెట్టింపు పరిమాణంలో కంటైనర్‌ ద్వారా రవాణా జరగడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. అందరూ శివరాత్రి సంబరాల్లో ఉండగా గంజాయి రవాణాదారులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అర్బన్‌ జిల్లా పోలీసులు రాజానగరం పోలీసుల సహకారంతో మాటువేసి సూర్యారావుపేట వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కంటైనర్‌లో వెళ్తున్న వ్యాన్‌లో ఉన్న 1,258 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.63 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వాహనంలో 74 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయితోపాటు ఇద్దరు నిందితుల నుంచి రూ.69,800 నగుదు, బుల్లెట్ వాహనం, 10 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

రెండు నెలల వ్యవధిలో..

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..నిందితులు అరెస్టు..ఇలా ప్రతికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంజాయి రవాణా మాత్రం కొంచెం కూడా ఆగడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం ఏరియా నుంచి భారీగా తరలిపోతున్న గంజాయి అప్పుడప్పుడు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఏరియాలోనే పట్టుబడుతుండడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికంటే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ గంజాయి రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే విషయాన్ని సంబంధిత అధికారులు ఆరా తీయాల్సి ఉంది. గతంలో మాటెలావున్నా కొత్త సంవత్సరం (2017) ప్రారంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈ ప్రాంతం మీదుగా రవాణా అవుతున్న సుమారు రూ.36 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారంటే రవాణా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

రవాణాలో సరికొత్త పద్ధతులు

గంజాయిని రవాణా చేయడంలో నిందితులు ఏమాత్రం భయపడడం లేదనేది వాస్తవం. గతంలో కారు డిక్కీల్లోను, పాత టైర్లలోను ఎవరికీ కనిపించకుండా తరలించేందుకు ప్రయత్నించేవారు. ఇటీవల సాధారణ సరుకులు మాదిరిగానే వ్యాన్, లారీలలో ధాన్యం బస్తాల వేసుకున్నట్టుగా గంజాయిని తీసుకు పోతున్నారు.  ఇప్పుడు ఏకంగా కంటైనర్లను కూడా వారు వినియోగించే వరకు వెళ్లారు. గంజాయి రవాణా జరిగే సమయంలో ముందు కొంతమంది వ్యక్తులు ఫైలెట్లుగా బైకులు, చిన్నకారుల్లో ప్రయాణించడం, వెనుక గంజాయితో కూడిన వాహనాలు వెళ్లడం.. సినీ ఫక్కీలో గంజాయి రవాణా జరుగుతోంది. చెక్‌ పోస్టులను కూడా దాటుకుని రవాణా అవుతుందంటే చిన్న విషయం కాదు. ఈ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో గాని, రవాణాకు సిద్ధమవుతున్న వ్యక్తుల్లోగానీ ఏమాత్రం భయం కనిపించకపోవడం విచిత్రం. ఇందుకుగల కారణాలేమిటి. వారి వెనుక ఉన్న బలం ఎవరనే విషయమై పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top