నెత్తురోడిన ఉత్తరాంధ్ర...

నెత్తురోడిన ఉత్తరాంధ్ర... - Sakshi


విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాలు ఆదివారం రక్తమోడాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సిరికొండ వద్ద సీతంపేట వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు  ఢీకొనటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పలువురిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో అంబులెన్స్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో  సంఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మృతదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఒడిశాలోని కటక్‌కు తీసుకెళుతున్నారు. యలమంచిలి సమీపంలోకి రాగానే జాతీయ రహదారి నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పడిపోయింది. 10 నెలల శిశువుతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు. మరోవైపు నక్కపల్లి మండలం మనబాలవానిపాలెం వద్ద ఆగివున్న లారీని..ద్విచక్ర వాహనదారుడు వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడకక్కడే చనిపోయాడు.



అలాగే రాంబిల్లి మండలం లోగపాలెం రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీకి చెందిన రాజు (24), గంగిరి రమణ (22) బైక్‌పై వెళుతుండగా బొలెరో ఢీకొంది. రాజు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. రమణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.



విజయనగరం జిల్లా బొబ్బిలి శివారులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు కూడా ఉన్నారు. బొబ్బిలిలో శనివారం రాత్రి పెళ్లి చేసుకుని ఆదివారం ఉదయం కారులో వస్తుండగా శివారులో ముందు పోతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని కారు బోల్తాపడింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఎం. అప్పలనాయుడు(40) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రొంపెల్లి గ్రామవాసి. గాయపడినవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top