కలబంద మేత తిన్న 12 మేకలు మృతి

కలబంద మేత తిన్న 12 మేకలు మృతి


రాయదుర్గం టౌన్‌ : కలబంద మేత తిన్న 12 మేకలు మృత్యువాతపడ్డాయి. మరో ఎనిమిది అస్వస్థతకు గురయ్యాయి. వివరాల్లోకెళితే.. రాయదుర్గం పట్టణంలోని టిప్పు మసీదు ఏరియాలో నివాసముంటున్న నాయకుల మారెన్న మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన 20 మేకలను మేత కోసం ప్రసన్న వెంకటరమణస్వామి గుడి వెనుక కొండపై గల శ్రీరాముడి ఆలయం వెనుక భాగానికి తీసుకెళ్లాడు. ఇది వరకే మేత కోసం కలబంద మొక్కలను సన్నగా తరిగి ఓ బండపై నిల్వ చేశాడు.



అదే మేతను తిన్న మేకలు కొద్దిసేపటికే నురగ కక్కుతూ నేలకూలాయి. ఏం జరుగుతోందో తెలుసుకొనేలోగా మొత్తం 12 మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. బంధువులకు సమాచారం అందజేయగా కొండకు చేరుకుని మేకలను వెంకటరమణస్వామి గుడి వద్దకు చేర్చారు. కలబంద మేతలో ఎవరైనా విష ప్రయోగం చేసి ఉంటారని బాధితుడు మారెన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మేకల మృతితో దాదాపు రూ.75 వేల నష్టం వాటిల్లిందని తెలిపాడు. పశువైద్యాధికారి, సిబ్బంది అక్కడికి చేరుకుని మిగతా 8 మేకలకు చికిత్స అందజేస్తున్నారు. బాధితులను కౌన్సిలర్‌ సుమలత, టీడీపీ నాయకులు పసుపులేటి నాగరాజు, షబ్బీర్, తిప్పేస్వామి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పవన్‌కుమార్, మారేష్‌ పరామర్శించారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top