వంద ‘ఫీట్ల’ విస్తరణ

వంద ‘ఫీట్ల’ విస్తరణ - Sakshi


ఇష్టారాజ్యంగా పనులు

అనధికారికంగా ఇరువైపులా కలిపి 80 ఫీట్లకే కుదింపు

డ్రెయినేజీ నిర్మాణంలోనూ  నిబంధనలు గాలికి..




గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్  కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిని విస్తరించాలని గతంలో నిర్ణయించారు. ఈమేరకు 2015 ఫిబ్రవరి 28న జరిగిన సాధారణ సమావేశంలో పాలకవర్గం తీర్మానించింది. జీవో 199, ఎంఏ 11–05–2001 ప్రకారం వంద ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నట్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.



తారు రోడ్డు నిర్మాణం చేపట్టిన సింగరేణి

గోదావరిఖని పట్టణంలో 3.1 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని విస్తరించేందుకు పాలకవర్గంతోపాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని రహదారి పనులు చేపట్టాలని కోరడంతో అంగీకరించింది. రూ.6.50 కోట్లను విడుదల చేయడంతో మంచిర్యాలకు చెందిన కాంట్రాక్టర్‌ ద్వారా రూ.5.75 కోట్ల మేరకు తారురోడ్డు పనులను పూర్తి చేయించారు. మొత్తం వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో డివైడర్‌ నుంచి ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డులో 25 ఫీట్ల మేర సింగరేణి ఆధ్వర్యంలో తారురోడ్డు నిర్మించారు. మిగతా 25 ఫీట్లలో ఇరువైపులా ఎవరు రహదారిని ఆక్రమించకుండా చివరలకు ఐదు ఫీట్ల వరకు రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రెయినేజీని నిర్మించాలకి నిర్ణయించారు. తారు రోడ్డుకు, డ్రెయినేజీ నిర్మాణానికి మధ్యలో ఉన్న 20 ఫీట్లమట్టి రోడ్డును ఖాళీగానే వదిలి పెట్టాలి.  



ఏం జరుగుతుంది...?

కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రూ.రెండు కోట్ల 92 లక్షల 50వేల కార్పొరేషన్  నిధులతో రహదారికిరువైపులా వర్షపు నీరు వెళ్లేందుకు 2016 మే 1న డ్రెయినేజీ పనులకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రధాన చౌరస్తా సమీపం వరకు అక్కడక్కడ పనులు చేపట్టగా...అవి అస్తవ్యస్తంగా మారాయి. కార్పొరేషన్ కార్డుల్లో వంద ఫీట్ల రహదారి విస్తరణ చేపట్టి అందుకనుగుణంగా డ్రెయినేజీ పనులు చేస్తున్నట్లు నమోదు చేసినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.


సాక్షాత్తు కార్పొరేషన్  కార్యాలయం సమీపంలోనే రహదారి విస్తరణ 80 ఫీట్లకు కుదించగా...డ్రెయినేజీ పనులూ ఇరువైపులా వేర్వేరుగా సాగుతున్నాయి. కార్పొరేషన్  కార్యాలయం, రాజేశ్‌ టాకీస్‌ ఏరియా, గాంధీనగర్‌ వద్ద, టీఎన్ టీయూసీ కార్యాలయం వద్ద డ్రెయినేజీ పనులను ఒక్కోక్క చోట 40 నుంచి 50 ఫీట్లుగా మార్కింగ్‌ చేసి చేపట్టారు. దీంతో కాలువ వంకరటింకరగా మారింది. జూనియర్‌ కళాశాల ఎదురుగా ఒక వైపు డ్రెయినేజీ పనులు ఎక్కువ వెడల్పుతో, మరో వైపు రహదారిపై ఉన్న నిర్మాణాలకు నష్టం కలగకుండా తక్కువ వెడల్పుతో నిర్మించారు. ఇలా ఒకే రహదారిపై ఒక్కో చోట రహదారి కుదించుకుపోవడం అనుమానాలకు తావిస్తోంది.



సింగరేణి ప్రహరీని ముట్టుకోని కార్పొరేషన్

రామగుండం కార్పొరేషన్  కార్యాలయం ఎదురుగా సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం క్వార్టర్లను నిర్మించింది. ఈక్రమంలో బయటివ్యక్తులు సింగరేణి స్థలంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారనే ఉద్దేశంతో క్వార్టర్ల చుట్టూ  ప్రహరీ నిర్మించింది. అయితే వంద ఫీట్ల రహదారిని విస్తరించే క్రమంలో సింగరేణి ప్రహరీఅడ్డురావడంతో దానిని కూల్చివేయడానికి కార్పొరేషన్  యంత్రాంగం మార్కింగ్‌ చేసింది. ఇదిలా ఉండగా...ఈ  గోడ ఎత్తు పెంచేందుకుగాను కార్పొరేషన్  అనుమతినివ్వాలని కోరుతూ సింగరేణి ఆర్జీ–1 జీఎం 2015 నవంబర్‌ 19న కార్పొరేషన్  కమిషనర్‌కు లేఖ రాశారు. కానీ వందఫీట్లతో రహదారిని విస్తరిస్తున్నందున అడ్డుగా ఉన్న ప్రహరీని కూల్చివేయాలని, ప్రస్తుతం దాని ఎత్తు పెంచేందుకు వీలు లేదంటూ కార్పొరేషన్ నుంచి సింగరేణికి లేఖ పంపించారు.


ప్రస్తుతం రహదారి విస్తరణలో సింగరేణి ప్రహరీగోడను కూల్చకపోగా.. దానికి అనుకుని ఉన్న డ్రెయినేజీ కాల్వనే కొనసాగించడం గమనార్హం. పేరుకు వంద ఫీట్లతో కాగితాలపై రాసుకున్న పాలకవర్గం ఆచరణలో 80 ఫీట్లు, అంతకన్నా తక్కువగా విస్తరించడం, డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తంగా, ఇష్టారాజ్యంగా చేపట్టడం ప్రమాదాలను నెలవుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రాజేశ్‌  టాకీస్‌ నుంచి మార్కండే కాలనీమీదుగా అడ్డగుంటపల్లి వరకు రహదారి విస్తరణలో భవనాలను బలవంతంగా కూల్చివేయిస్తున్న పాలకవర్గం మరోవైపు కార్పొరేషన్  కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్  చౌరస్తా వరకు ఇష్టంవచ్చినట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top