మార్చి లోగా 1.5లక్షల ఉద్యోగాలు

మార్చి లోగా 1.5లక్షల ఉద్యోగాలు


పరిశ్రమల స్థాపనలో సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం

జనవరి 27 నుంచి భాగస్వామ్య సదస్సు

4 జిల్లాల పారిశ్రామిక వేత్తల సమావేశంలో సీఎస్ టక్కర్




సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండేళ్లలో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఎన్నారై కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టబోతున్నాయని, తద్వారా 15 శాతం వృద్ధిరేటును ఏపీ సాధించబోతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ వెల్లడించారు. వచ్చే మార్చి కల్లా లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించే దిశగా కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో గురువారం విశాఖలోని ఓ హోటల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.



పరిశ్రమల స్థాపనలో భూ సంబంధ, విద్యుత్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక, సేల్స్‌టాక్స్ శాఖల నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో ఆయా శాఖలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని పలువురు పారిశ్రామిక వేత్తలు సీఎస్ దృష్టికి తీసు కొచ్చారు. మీ వల్ల పారిశ్రామికీకరమ మందగించే ప్రమాదం ఉందని సీఎస్ సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన 150 దరఖాస్తులు సీఐఐ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అగ్నిమాపక శాఖ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వారంలో విజయవాడలో మరో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, అగ్నిమాపక శాఖాధికారులంతా విధిగా హాజరు కావాలని ఆదేశించారు. పర్యాటక రంగానికి సంబంధించి 23 కంపెనీలతో ఎంవోయూలు జరగ్గా మూడు మాత్రమే ఇప్పటివరకు తుదిరూపు దాల్చాయన్నారు. వచ్చే నెల 27 నుంచి 29 వరకు మూడ్రోజుల పాటు విశాఖలో మరోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.



విశాఖలో 94 పరిశ్రమలకు ఆడిట్ చేయగా, కేవలం 12 పరిశ్రమలు తప్ప మిగిలిన పరిశ్రమలేవీ ప్రమాణాలకనుగుణంగా నడవడం లేదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. కేవలం 16 కంపెనీలు మాత్రమే ఇప్పటివరకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చాయన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న 3300 కంపెనీలను ఒకే ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ డీఎం ఎం.నాయక్ అన్నారు. వారంతా కైజాలా యాప్ ద్వారా ఒకే గ్రూపులోనికి రావాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, సీఐఐ చైర్మన్ శివకుమార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుమెంబర్ సెక్రటరీ బీఎస్‌ఎస్ ప్రసాద్, నాలుగు జిల్లాల పరిశ్రమల శాఖల అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top