స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ: జస్టిస్ రమణ

స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ: జస్టిస్ రమణ


 అప్పుడే వారి సమస్యలకు  సత్వర పరిష్కారం

 ♦  సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం: కొత్త అధ్యక్షుడు చౌదరి

  ఘనంగా ముగిసిన మహాసభలు


 డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: భారత్‌లో పెండింగ్‌లో ఉన్న 3 కోట్ల పై చిలుకు కేసుల్లో స్త్రీలపై జరిగిన అకృత్యాలకు సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. వాటి సత్వర పరిష్కారానికి స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల మూడో రోజు శనివారం డెట్రాయిట్‌లో స్త్రీల ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ప్రతి పది లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలుంటే అమెరికాలో 150 మంది ఉన్నారన్నారు. భారత్‌లో కోర్టుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉందన్నారు.



తెలుగు భాష మాధుర్యాన్ని భావి తరాలకు అందించాలంటే దాన్ని పిల్లలతో విధిగా సాధన చేయించాలని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఏదో పదేళ్ల వయసు దాకా నేర్పించి ఆ తర్వాత వదిలేస్తే తెలుగుకు అన్యాయం చేసినట్టేనని తానా సాహిత్య సభల్లో మాట్లాడుతూ అన్నారు. సుద్దాల అశోక్ తేజ ఆలపించిన నేలమ్మా పాటను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 బాధ్యతలకు న్యాయం చేశా: మోహన్

 తానా అధ్యక్షునిగా తన బాధ్యతలను రెండేళ్లుగా విజయవంతంగా నిర్వహించానని నన్నపనేని మోహన్ అన్నారు. డెట్రాయిట్‌లోని కోబో సమావేశ మందిరంలో జరిగిన ముగింపు వేడుకల్లో కొత్త అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరికి ఆయన బాధ్యతలను అప్పగించారు. తానా కార్యవర్గం తనకు పూర్తి సహకారం అందించిందని కొనియాడారు. తానాలో మార్పులను సూచించాలంటే తనకు ఒక్క ఇ-మెయిల్ పంపితే చాలని చౌదరి అన్నారు. పాత ఆశయాలను కొత్త ఒరవడిలో ముందుకు తీసుకెళ్తానని, సేవా కార్యక్రమాలను భారీగా విస్తరిస్తానని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా వేమన సతీశ్, కార్యదర్శిగా తాతా మధు, కోశాధికారిగా వెన్నం మురళీ ఉంటారు. మూడు రోజుల తానా మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి.



జస్టిస్ రమణ, సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, పురస్కార కమిటీ అధ్యక్షుడు కొర్రపాటి రఘులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానిం చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, బోండా ఉమా, సత్యప్రసాద్, కూన రవికుమార్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు విడిపోయినా అందరం ఒక్కటేనని, త్వరలోనే అన్నీ సమస్యలు సర్దుకుంటాయని అన్నారు. మణిశర్మ సంగీత విభావరితో కార్యక్రమం ముగిసింది. సుమ, ఝాన్సీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. నటులు అల్లరి నరేశ్, నారా రోహిత్, నిఖిల్, హీరోయిన్లు తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, రకుల్‌ప్రీత్‌సింగ్ హాస్య సంభాషణలతో అలరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top