ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రవాసాంధ్రులు

ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రవాసాంధ్రులు - Sakshi


నార్త్ కరోలినా (ఛార్లెట్‌‌) : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి అమెరికాలోని ఉత్తర కరోలినా ఛార్లెట్‌ నగరంలో ప్రవాసాంధ్రులు తమ మద్ధతుగా గళమెత్తారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం తీరును, రాష్ట్రంలో తలెత్తుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ విభాగం నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఛార్లెట్‌ నగరంలో శనివారం వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.  'మీ కేసుల మాఫీ కోసం.. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా?', 'ప్రత్యేక హోదా బిక్ష కాదు.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు' అని ప్లకార్డులతో నిరసన తెలిపారు.



ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును వైఎస్ఆర్ సీపీ ఛార్లెట్ టీమ్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ విషయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామని చెప్పారని, రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అంశాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక హోదాకు మద్ధతు కరువైందని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు సినిమాలను బాయ్ కాట్ చేస్తామని ఎన్ఆర్ఐలు హెచ్చరిస్తున్నారు. ఓ మంచి కారణం కోసం మద్ధతు తెలపాల్సిందిగా టాలీవుడ్ ఇండస్ట్రీని కోరారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి అవకాశాలొస్తాయన్నారు.



స్పెషల్ ప్యాకేజీ కంటే స్పెషల్ స్టేటస్‌తోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ టీమ్ అక్కడి ప్రవాసాంధ్రులకు వివరించింది. 'ఏపీకి ప్రత్యేక హోదా కావాలి' అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. సుబ్బారెడ్డి మేక, కె.రాధాక్రిష్ణరెడ్డి, పి.సంజీవరెడ్డి, సబ్బసాని వెంకట్, సింగల్‌రెడ్డి శ్రీనివాస్, రోహిత్, రామక్రిష్ణ, కైపు, మదం బోయనపల్లి, అనిరుద్‌రెడ్డి, వెంకట్ వరప్రసాద్, ఛార్లెట్ లోని తెలుగు విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి తమ మద్ధతు ప్రకటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.



Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top