లండన్లో చేనేతకు చేయూత సదస్సు






లండన్: 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చేనేత కళాకారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రవాస జనసేన కార్యకర్తలు నడుంబిగించారు. లండన్లో చేనేత- చేయూత సదస్సును జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సదస్సు లో ముఖ్యంగా చేనేత కళాకారుల సమస్యలను పరిష్కరించడానికి  కావాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారధ్యంలో పార్టీ తరఫున ప్రజా సమస్యల పై పోరాడతామని, అందుకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కార్యకర్తలు తెలిపారు.



చేనేత కళాకారుల సమస్యల పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, నేత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వమే నేరుగా వస్త్రాలను కొనుగోలు చేయాలని సదస్సులో పాల్గొన్న ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో చర్చించిన విషయాలను జనసేన కార్యాలయానికి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ హాం కౌన్సిలర్ పాల్ హాజరయ్యారు. ప్రముఖ సినీతార ప్రణీత చేనేతకు పూర్తి మద్దతు తెలుపుతూ తన సందేశాన్ని పంపించడం ఈ కార్యక్రమంలో మరో విశేషం.







ఈ సదస్సులో జనసేన కార్యకర్తలు ఇంగ్లాండ్లోని వెస్ట్ లండన్, సౌతాంఫ్టన్, మాంచెస్టర్ తదితర ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, జర్మనీ, తైవాన్ తదితర దేశాల నుంచి కూడా  కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి సందీప్ పంచకర్ల కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొని తన మద్దతును ప్రకటించి నిర్వాహకులను అభినందించారు. ఈ సదస్సులో ఎన్ఆర్ఐ జనసేన కార్యవర్గం నాగ రమ్యకాంత్, అయ్యప్ప గార్లపాటి, నరేంద్ర మున్నలూరి, శ్రీరామ్ అంగజాల, రుద్ర వర్మ బట్ట, శ్రీకాంత్ మద్దూరి,రాంబాబు, సురేష్ మొగంటి, రాఘవ, జగదీష్, రాకేష్, ఉదయ్, రాజవశిష్టా, సిద్ధం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.     



  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top