రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్‌ల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్‌ల ఆగ్రహం


అహ్మదాబాద్‌: మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌లో సర్పంచ్‌ల అధికారాలకు అంట కత్తెరేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సర్కులర్‌పై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. సర్సంచ్‌లు ఏ అభివద్ధి కార్యక్రమానికి నిధులు కావాలన్నా తలాతి (విలేజ్‌ అకౌంటెంట్‌) అనుమతి తీసుకోవాలి. అందుకు అకౌంటెంట్‌ సంతకం చేయాలి. ఖర్చులన్నింటికి ఆయన లేదా ఆమెదే బాధ్యత. గతంలో నిధుల ఖర్చుకు ఓ సర్పంచ్, మరో పంచాయతీ సభ్యుడు బాధ్యులుగా ఉండేవారు.



ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థను ఈ కొత్త నిబంధన దెబ్బతీస్తుందని, ప్రజా ప్రతినిధుల అధికారాలను అంటకత్తెర వేస్తోందని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివద్ధి పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో, ఇది అలాగే ఉందని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి అధికారాలను కూడా కత్తిరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది సర్పంచ్‌లు నిరక్షరాస్యులను, దాన్ని ఆసరాగా తీసుకొని నిధులను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చామని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి జయంతి కవాడియా చెబుతున్నారు.



స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం కోసం అధికార వికేంద్రకరణ పేరిట కేంద్ర ప్రభుత్వం 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీనిద్వారా జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో పంచాయతీ రాజ్‌ మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ వచ్చి పాతికేళ్లు పూర్తవుతున్న ఇంకా బలపడలేదు. ఎక్కువ వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడే పనిచేయాల్సి వస్తోంది. సర్పంచ్‌లకు సరైనా అధికారాలు లేవు. నిర్వర్తించాల్సిన విధులెన్నో ఉన్నా అందుకు సరిపడా నిధులు లేవు. వ్యవసాయం, నీటిపారుదల, జంతుసంరక్షణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం లాంటి అన్ని విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.



ప్రతి దానికి గ్రామ అకౌంటెంట్‌ లేదా రెవెన్యూ కార్యదర్శి అనుమతి తీసుకోవాలంటే తమకు చాలా ఇబ్బందని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఈ అధికారులు చాలా సందర్భాల్లో స్థానికులు కాకుండా ఉంటారని, అలాంటప్పుడు వారు గ్రామ అవసరాలను గుర్తించలేరని, కొన్ని సందర్భాల్లో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక్క అకౌంటెంటే ఉంటారని, అలాంటప్పుడు వారు అందుబాటులో ఉండరని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగాలుగా తామేమీ మాట్లాడకూడదని, అయితే పని భారం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top