ఒమన్లో రోడ్డునపడ్డ భారతీయ కార్మికులు

ఒమన్లో రోడ్డునపడ్డ భారతీయ కార్మికులు - Sakshi

ఒమన్‌ :

ఒమన్లోని పెట్రోన్ గల్ఫ్ కంపెనీ మూతపడటంతో 900 మంది భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు. గత నాలుగు నెలలుగా జీతాలురాక, తిండిలేక వీరందరూ అలమటిస్తున్నారు. వీరిలో 30 మంది తెలంగాణ, 170 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఉన్నారు. గత ఎనిమిది నుండి పదేళ్లుగా పెట్రోన్ గల్ఫ్ కంపెనీలో పనిచేస్తున్న వీరికి నాలుగు నెలల జీతం, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరికి రూ.3 నుంచి 4 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి లేబర్ కోర్టులో కేసు వేసి పోరాడాడటానికి మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ అధికారం ఇచ్చారు. 

 

మొదటి విడతగా వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి ఇండియన్ ఎంబసీ ఉచిత విమాన టికెట్లు సమకూర్చి బుధవారం మస్కట్ నుండి ఇండియాకు పంపించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ కు చెందిన జడల బాబయ్య, నిజామాబాద్ జిల్లా నవీపేట్కు చెందిన వొటార్కర్ భూమేష్, ఆంధ్రప్రదేశ్కు చెందిన గుజ్జు లక్ష్మణ మూర్తి, చింత తులసి రావు, మోటూరి గణేష్లు బుధవారం ఉదయం మస్కట్ నుండి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భీమ్ రెడ్డి విమానాశ్రయానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ వింగ్ కన్వీనర్ గణేష్ గుండేటి చేతి ఖర్చులకు తెలంగాణ వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి రూపాయలు అందజేసినట్లు వారు తెలిపారు. 


 

పునరావాసం, న్యాయ సహాయం కావాలి 

ఒమన్లో పెట్రోన్‌ గల్ఫ్‌ కంపెనీ యాజమాన్యం మోసానికి గురైన వలసకార్మికులకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించి, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా ఎంపికచేసి ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బకాయిలు రాబట్టుకోవడానికి న్యాయ సహాయం అందించాలని కోరారు. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు అవకాశమున్న చోట ఉద్యోగాలు కల్పించాలని మస్కట్లోని భారత రాయబారి ఇంద్రామని పాండే ఒమన్ లోని పలు కంపెనీలను సంప్రదించడంపట్ల దేవేందర్ రెడ్డి అభినందించారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top