అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి

అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి - Sakshi


అమెరికాలోని లూయిస్ విల్లీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల(35), రాజశేఖర్ రెడ్డి యారామాల(25), వెంకట ప్రశాంత్ కొమ్ము(27), అన్వేష్ కుమార్(24)లు లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్నారు.


కారును నడుపుతున్న రామ ముందు ఉన్న భారీ టర్నింగ్ ను గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయినట్లు ఏజెన్సీ పేర్కొంది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ, రాజశేఖర్ లు, వెనుకభాగంలో కూర్చున్న అన్వేష్ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయినట్లు తెలిపింది. కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.


ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్(యూసీఎమ్ సీ) కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్‌ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. ఈ ఏడాది జనవరిలో ఎంఎస్ చేయడానికి రాజశేఖర్ అమెరికా వెళ్లాడు. రాజశేఖర్ రెడ్డి మృతితో బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం అలుముకుంది.


అలాగే యూసీఎమ్ సీ, సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్, రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top