పట్టభద్రులు, ఉపాధ్యాయుల తీర్పుతో సిగ్గుపడాలి

పట్టభద్రులు, ఉపాధ్యాయుల తీర్పుతో సిగ్గుపడాలి - Sakshi


► రూ.300 కోట్లు ఖర్చు చేశారు

► స్థానిక సంస్థల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్‌ వివేకాదే

► వైఎస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఫలించవు

► విలేకరుల సమావేశంలో ఆకేపాటి




కడప కార్పొరేషన్‌: శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల తీర్పు చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్, కర్నూల్, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో 2800 మంది ప్రజా ప్రతినిధుల ఓట్లను రూ.300 కోట్లు పెట్టి కొనుగోలు చేశారన్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నడిరోడ్డులో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ముగ్గురు మంత్రులు ఈ జిల్లాలలో తిష్టవేసి వందల కోట్లు వెచ్చించినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారన్నారు. స్థానిక ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్‌ వివేకానందరెడ్డిదేనని తెలిపారు. ఈ గెలుపునే బలుపుగా భావించిన టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీకి కంచుకోట అయిన వైఎస్సార్‌ జిల్లాలో పాగా వేశాం, పులివెందులలో వైఎస్‌ జగన్‌పై పోటీ చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. వారి సంతోషం కొద్దిసేపు కూడా నిలవకుండానే పట్టభద్రులు, ఉపాధ్యాయులు షాక్‌ ఇచ్చారన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారని, చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ బలపరిచిన సుబ్రమణ్యం గెలుపొందారన్నారు. దీన్నిబట్టి చదువుకున్న వారంతా వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరిచినట్లయిందన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నేడు అదే కుట్రలు, కుతంత్రాలతో వైఎస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలు ఎన్నటికీ ఫలించవన్నారు.



తెలుగుదేశం పార్టీ నాయకులకు చీము, నెత్తురు ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని మేయర్‌ సురేష్‌బాబు సవాల్‌ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి శాసనమండలి ఎన్నికలు జరిగాయని, లోకేష్‌బాబు ఆధ్వర్యంలో వందల కోట్లు వెచ్చించి సంతలో పశువుల్లా ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేశారన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వందలకోట్లు ఖర్చుపెట్టి గెలిచిన టీడీపీ నాయకులు ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేకపోయారన్నారు. ఐదు జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా, దౌర్జన్యాలు, కిడ్నాపులకు పాల్పడినా తలొగ్గకుండా నీతి, నిజాయితీలతో ఓటేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, రాష్ట్ర నాయకులు ఆర్‌వీఎస్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ అ«ధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, నగర మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ పాల్గొన్నారు.



 

Read latest Devotion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top