‘ఫెడ్’ ఎక్స్‌ప్రెస్..!

‘ఫెడ్’ ఎక్స్‌ప్రెస్..! - Sakshi


సెన్సెక్స్ 481 పాయింట్ల హైజంప్...

తొలగిన అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు

గత 4 నెలల్లో అత్యధిక లాభం

27,112 వద్ద ముగిసిన సెన్సెక్స్

8,100 పాయింట్లను దాటిన నిఫ్టీ

అన్ని రంగాలదీ లాభాల దూకుడే

వడ్డీ పెంపు భయాలకు చెక్ పెడుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరికొంత కాలం నామమాత్ర రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ ముగింపునకు వచ్చినప్పటికీ ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచబోమంటూ ఫెడ్ వెల్లడించడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ బలపడింది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున పెకైగిశాయి. గత నాలుగు నెలల్లోలేని విధంగా సెన్సెక్స్ 481 పాయింట్ల హైజంప్‌తో మళ్లీ 27,000ను అధిగమించగా, నిఫ్టీ సైతం 8,100 పాయింట్లను దాటేసింది!

 

రెండు రోజుల పాలసీ సమీక్షను ముగిస్తూ ఫెడ్ చైర్‌ఉమన్ జానట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలను కొట్టిపారేశారు. తద్వారా వర్ధమాన మార్కెట్లు ఊపిరి పీల్చుకునేలా చేశారు. కొద్ది సంవత్సరాలుగా అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఫెడ్ పంప్‌చేస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్లు వర్ధమాన స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్‌తో సహాయక ప్యాకేజీ ముగిసిపోనుండటంతో అంచనాల కంటే ముందుగానే అమెరికా వడ్డీ పెంపును చేపడుతుందన్న ఆందోళనలు ఇటీవల మార్కెట్లలో బలపడుతూ వచ్చాయి. ఇదిజరిగితే డాలర్ల నిధులరాక నిలిచిపోవడంతోపాటు, పెట్టుబడులు మరలిపోతాయన్న భయాలు వ్యాపించాయి. దీంతో కొద్ది రోజులు గా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. అయితే ఫెడ్ తాజా ప్రకటనతో మార్కెట ్లకు కొత్త ఉత్సాహం వచ్చింది.

 

చైనా ఒప్పందాలూ కీలకమే

మరోవైపు చైనాతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చాయి. భారత్, చైనాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారానికి ఐదేళ్ల ఒప్పందం కుదిరింది. తద్వారా 20 బిలియన్ డాలర్ల చైనా పెట్టుబడులకు వీలు చిక్కడంతో ఇన్వెస్టర్ల ఉత్సాహం రెట్టింపైంది. వెరసి నిఫ్టీ సైతం 139 పాయింట్లు దూసుకెళ్లి 8,115 వద్ద స్థిరపడింది. ఫలితంగా వారం రోజుల గరిష్ట స్థాయికి మార్కెట్లు చేరుకున్నాయి.

 

విశేషాలెన్నో....

ఇంతక్రితం మే 12న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో(557 పాయింట్లు) పుంజుకుంది. కొనుగోళ్లు ఏ స్థాయిలో వెల్లువెత్తాయంటే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో అన్ని రంగాలూ 0.6% నుంచి 5% వరకూ పురోగమించాయి.

సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్(1%), హెచ్‌యూఎల్(0.5%) మాత్రమే నష్టపోయాయి.

బ్లూచిప్స్‌లో ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, భెల్, డాక్టర్ రెడ్డీస్, టాటా పవర్, ఎన్‌టీపీసీ, విప్రో, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టీసీఎస్, యాక్సిస్, రిలయన్స్ 3.5-1.5% మధ్య లాభపడ్డాయి.

ఆటో దిగ్గజాలలో హీరో మోటో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతీ 5.5-2.5% మధ్య స్పీడందుకున్నాయి. ఇక శుక్రవారం నుంచీ నిఫ్టీలో భాగంకానున్న జీఎంటర్‌టైన్‌మెంట్ షేరు 5% ఎగసింది.

బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 3-2శాతం మధ్య పెరిగాయి.  

రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% పుంజుకుంది.  యూనిటెక్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్ 13-4% మధ్య ఎగిశాయి.

బీఎస్‌ఈ-500లో ఇంటర్నేషనల్ పేపర్, హాట్సన్ ఆగ్రో, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, బ్లూడార్ట్, పొలారిస్, జేకే టైర్, హెక్సావేర్, చెన్నై పెట్రోలియం, రుచీ సోయా 16-10% మధ్య దూసుకెళ్లాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top