విప్రో 11వేల కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌

విప్రో 11వేల కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ : దేశీయ మూడో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ విప్రో అంచనాల్లో అధిగమించినప్పటికీ, లాభాల్లో పడిపోయింది. గురువారం ప్రకటించిన 2017-18 జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్లో విప్రో 8 శాతం సీక్వెన్షియల్‌ డ్రాప్‌ను నమోదుచేసి, నికర లాభాలు రూ.2,076.50 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. గత మార్చి క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.2,261.10 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూలు రూ.13,205.6 కోట్లగా ఉన్నాయి. ఇవి విశ్లేషకులు అంచనావేసిన రూ.12,828 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈబీఐటీ మార్జిన్లు కూడా విశ్లేషకుల అంచనాల కంటే అధికంగానే 16.8 శాతం నమోదయ్యాయి. కానీ కంపెనీ డాలర్‌ రెవన్యూ గైడెన్స్‌లో నిరాశపరిచింది. తమ ఐటీ సర్వీసుల నుంచి వచ్చే రెవెన్యూలు -0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు ఉంటాయని కంపెనీ అంచనావేస్తోంది. కాగ కంపెనీ మొత్తం ఆదాయం రూ. 13,661.40 కోట్లకు పెరిగింది. ఇది మార్చి క్వార్టర్‌లో రూ.14,470.20 కోట్లగా ఉంది. 

 

ముందస్తు ప్రకటించిన మాదిరిగానే షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై విప్రో స్పష్టతనిచ్చింది. రూ.11వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్టు కంపెనీ తెలిపింది. ఈ బైబ్యాక్‌లో ఒక్కో షేరును రూ.320కు కొనుగోలు చేయనుంది. 343.75 మిలియన్ల వరకు షేర్‌ బైబ్యాక్‌ను విప్రో చేపడుతోంది. వరుసగా రెండేళ్ల నుంచి విప్రో బైబ్యాక్‌ ప్రకటన చేస్తూ వస్తోంది. గతంలో 40 మిలియన్‌ షేర్లను మాత్రమే బైబ్యాక్‌ చేసింది. ఒక్కో షేరుకు రూ.625 చొప్పున మొత్తం రూ.2500 కోట్ల మేర బైబ్యాక్‌ను చేపట్టింది. ఇప్పటికే పెద్ద కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌లు, మిడ్‌క్యాప్‌, చిన్న కంపెనీల్లో మైండ్‌ట్రి బైబ్యాక్‌లను ప్రకటించాయి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top