భారత్లోనూ విమానాల్లో వైఫై..

భారత్లోనూ విమానాల్లో వైఫై..


కాల్స్‌కూ అవకాశం.. వచ్చే నెల నుంచి ప్రారంభం

తుది ఆమోదమే తరువాయి


న్యూఢిల్లీ : విమానాల్లో సెల్‌ఫోన్ సేవలకు లైన్ క్లియర్ అవనుంది. రానున్న పది రోజుల్లో ఈ దిశగా సానుకూల నిర్ణయం వెలువడనుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. విమానాల్లో వైఫై అనుమతించే అంశంపై పౌర విమానయాన, టెలికం, హోం శాఖలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ఇందుకు కేబినెట్ అనుమతి అవసరం పడకపోవచ్చన్నారు. డేటా వినియోగానికి అనుమతించినప్పుడు కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతించవచ్చన్నారు. విమానాల్లో వైఫై సేవల ప్రతిపాదన కేంద్రం ముందు ఎప్పటి నుంచో ఉంది. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డేటా, కాల్స్‌ను భద్రతా సంస్థలు పర్యవేక్షించడం వంటి అంశాలపై చర్చ జరిగిందని చౌబే వెల్లడించారు. అవసరమైతే భద్రతా సంస్థలు డేటా, కాల్స్ వివరాలు పొందవచ్చని, ట్రాక్ కూడా చేయవచ్చని చెప్పారు.


అదనపు ఆదాయం..

ప్రస్తుతం దేశీయంగా అన్ని విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతి లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు ఈ సేవలు అందిస్తున్నాయి. భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఆ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇవి తొలుత కొంత సమయం పాటు ఉచితంగా వైఫై అందిస్తూ... ఆ పై వినియోగానికి చార్జీ వసూలు చేస్తున్నాయి. కాగా, దేశీయంగానూ వైఫై సేవలకు అనుమతి లభిస్తే... ఇక్కడి ఎయిర్‌లైన్ సంస్థలకు అదనపు ఆదాయం సమకూరనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top