డిస్కౌంట్లు ఇస్తున్నా... కొనేవారు కరువు!

డిస్కౌంట్లు ఇస్తున్నా...  కొనేవారు కరువు! - Sakshi


బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనలో కస్టమర్లు

♦ కేంద్రం వచ్చే బడ్జెట్‌లో పుత్తడి దిగుమతి సుంకం తగ్గిస్తుందని ఆశలు

♦ ఔన్స్‌కు 25 డాలర్లమేర డిస్కౌంట్‌నిస్తున్న జ్యువెలరీ రిటైలర్లు

♦ అయినా పసిడి కొనుగోళ్లు నిల్!




ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కారణంగా పుత్తడి ధర పెరుగుతున్నా, వినియోగదారులు మాత్రం బంగారం, ఆభరణాల కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. దేశంలో పలు ప్రాంతాల్లో కస్టమర్లని ఆకర్షించేందుకు జ్యువెలరీ షాపులు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా బంగారానికి వినియోగ డిమాండ్ పెరగడం లేదు. వినియోగదారులు మాత్రం బంగారం కొనుగోలు విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. కేంద్రం రానున్న బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో.. జ్యువెలర్స్ పసిడి ధరలను తగ్గిస్తున్నప్పటికీ కూడా కస్టమర్లు ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని ట్రేడర్లు వాపోతున్నారు.


 కొనుగోళ్లు లేవు..

బంగారానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కొనుగోళ్లు జరగడంలేదని ఎంఎన్‌సీ బులియన్ డెరైక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు. ఈయన చెన్నైలో బంగారాన్ని హోల్‌సెల్ ధరకు విక్రయిస్తారు. పసిడి విక్రయాల పెరుగుదలకు, కస్టమర్లను ఆకర్షించడానికి డీలర్లు అధిక మొత్తం డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన కరువైందని తెలిపారు. లండన్ బంగారం ధరలపై ప్రీమియంను చార్జ్ చేసే భారతీయ బంగారం విక్రయదారులు కూడా ప్రస్తుతం ఔన్స్‌కు(31.1గ్రాములు) 25 డాలర్లమేర డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అంటే 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు. మంగళవారం రోజు ఏ చిన్న పుత్తడి ఆభరణాన్ని కూడా విక్రయించలేదని జవేరి బజార్‌లోని ఒక జ్యువెలర్ తెలిపారు. ఆఖరికి బంగారపు 9 ధరల పరిస్థితి ఎలా ఉందని కస్టమర్లు ఎలాంటి విచారణ  కూడా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది బంగారం ధరలు 13 శాతం పెరిగాయని, ఇది పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని కొందరు రిటైల్ కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు.


 డిమాండ్ పెరగొచ్చు!

పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారం డిమాండ్ వ్యూహాత్మకంగా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా చాలా మంది కస్టమర్లు వచ్చే కాలంలో ధరలు మరింత తగ్గొచ్చనే అంచనాల వల్ల పసిడి కొనుగోలుకు దూరంగా ఉండే పరిస్థితులు లేకపోలేదు. కాగా గత రెండు రోజులుగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఔన్స్‌కు 1,200 డాలర్లకు పైగా పెరిగాయి. ఈ చర్య పుత్తడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు.


 బంగారం దిగుమతి సుంకం తగ్గేనా?

కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరిలో (ఫిబ్రవరి 29) 2016-17 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పుత్తడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతంమేర తగ్గిస్తుందని జ్యువెలరీ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే సరఫరా పెరిగి బంగారం ధరలు తగ్గే అవకాశముంది. గతేడాది బడ్జెట్ ముందు కూడా పసిడి ధరలు తగ్గాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top