పడకగది ఏ దిక్కులో ఉండాలి?

పడకగది ఏ దిక్కులో ఉండాలి?


సాక్షి, హైదరాబాద్: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, క్షణం తీరిక లేకుండా గడిపి.. ఇంటికొచ్చాక సేద తీరేది పడక గదిలోనే. అందుకే ఇల్లు, ఇంట్లోని బెడ్‌రూమ్ అన్నీ పక్కాగా వాస్తు ప్రకారం ఉంటేనే ఇంట్లోని వారికి మనశ్యాంతి కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.


ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది.


కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులోనే ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పైఅంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలకు దారి తీయవచ్చు.


పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది.


ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి.


నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు.


తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు.


పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు.


ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు, న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబం ధించి మీ సందేహాలు మాకు రాయండి.  realty@sakshi.com

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top