ఎక్కడి ‘రేట్లు’ అక్కడే...

ఎక్కడి ‘రేట్లు’ అక్కడే...


 ముంబై: ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. దీనితో స్వల్పకాలిక రుణ రేటు రెపో(8 శాతం) సహా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్-4 శాతం), స్టాల్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్-22 శాతం) యథాయథంగా కొనసాగనున్నాయి.



ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులూ చేయకపోవడం ఇది వరుసగా నాల్గవసారి. ధరల పెరుగుదల భయాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంచనాల స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేంతవరకూ రేట్ల కోత అవకాశం లేదని ఉద్ఘాటించింది. మొత్తంగా చూస్తే పండుగల సీజన్‌లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో అటు బ్యాంకర్లు, ఇటు పరిశ్రమలు కొంత నిరాశకు గురయ్యాయి. పండుగల సీజన్‌లో వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అంచనాలు దీనితో ఆవిరయ్యాయి.



 సమీక్ష... ముఖ్యాంశాలు...

 పస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5%. 2015-16లో ఈ రేటు 6.3 శాతం ఉంటుందన్నది అంచనా.



తొలి త్రైమాసికంలో(2014-15, ఏప్రిల్-జూన్) 5.7% వృద్ధి రేటు 3, 4 త్రైమాసికాల్లోనూ కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే క్యూ4లో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉండవచ్చు.

     

వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతంగా ఉంటుందని అంచనా. 2016 నాటికి 6 శాతానికి తగ్గవచ్చు.

     

చిన్న, పేమెంట్ బ్యాంకులపై మార్గదర్శకాలు నవంబర్ చివరి నాటికి వెలువడతాయి.

     

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై సానుకూలత.

     

‘నో యువర్ కస్టమర్’ నిబంధనల సరళీకరణ. బ్యాంక్ అకౌంట్ల ప్రారంభానికి సొంత ధ్రువీకరణ పత్రాలకు సైతం అనుమతి.  ‘లో రిస్క్’ అకౌంట్ల విషయంలో కాలగుణంగా చిరునామా ధ్రువీకరణలకు సంబంధించి నిబంధనల సరళతరం.

     

ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి నిర్వచనంలో మార్పు ప్రక్రియ. రుణ ఎగవేత కంపెనీల డెరైక్టర్లనూ ఈ పరిధిలోకి తెచ్చేలా మార్పులు. మోసాల నివారణకు సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటు.

     

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు వల్ల బ్యాంకింగ్‌కు సంబంధించి  నెలకొన్న రుణ సమస్యలను ఎదుర్కొనే సత్తా, వెసులుబాటు వ్యవస్థలో ఉంది.

     

బాండ్ మార్కెట్‌లో ట్రేడింగ్ మరింత పెరిగేందుకు చర్యలు.

     

జన ధన యోజన వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ సేవలు మరింత విస్తృతం అవుతాయని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి నో యువర్ కస్టమర్ నిబంధనల సరళీకరణ వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండ వు.

     

తదుపరి ద్వైమాసిక పరపతి సమీక్ష డిసెంబర్ 2న.


బ్యాంకర్లు ఏమన్నారంటే...

 ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో రుణ, డిపాజిట్ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు.  ఎస్‌బీఐ  చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ... అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ నిర్ణయాలు ఉన్నాయన్నారు. అయితే మార్చితో పోల్చిచూస్తే,  రేట్ల పెంపుకన్నా తగ్గింపువైపే పాలసీ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మాత్రం ఆమె అన్నారు.ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.  



ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) పరిస్థితులు, రుణ వృద్ధి వంటి అంశాల ఆధారంగానే సమీప భవిష్యత్తులో తమ బ్యాంక్ రేట్లపై నిర్ణయాలు ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ చెప్పారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top