స్వచ్ఛమైన మంచి నీరు కోరుతున్నారు..

స్వచ్ఛమైన మంచి నీరు కోరుతున్నారు..


 అందుకే వాటర్ ప్యూరిఫయర్లకు డిమాండ్

     కొత్త టెక్నాలజీకి ఎంతైనా వెచ్చిస్తున్నారు

     2017 నాటికి రూ.6,100 కోట్లకు పరిశ్రమ

     2014-15లో రూ.600 కోట్ల టర్నోవర్ అంచనా


 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్యంపట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. స్వచ్చమైన మంచి నీరు కావాలంటున్నారు. ఇందుకోసం అత్యుత్తమ టెక్నాలజీని కోరుకుంటున్నారని అంటున్నారు కెంట్ ఆర్‌వో సిస్టమ్స్ చైర్మన్ మహేష్ గుప్తా. 2012లో దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు రూ.1,864 కోట్ల విలువైన 43 లక్షల వాటర్ ప్యూరిఫయర్లను విక్రయించాయి. 2017 నాటికి వాటర్ ప్యూరిఫయర్ల పరిశ్రమ రూ.6,100 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమ తీరుతెన్నులు, ఉత్పాదనల గురించి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.



 వాటర్ ప్యూరిఫయర్ల వినియోగం దేశంలో ఎలా ఉంది?

 కలుషిత నీటితో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే స్వచ్చమైన మంచి నీరు అందరూ కోరుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రజల్లో అంతలా అవగాహన వచ్చింది. సుమారు 80 శాతం గృహాల్లో వాటర్ ప్యూరిఫయర్లు ఉన్నాయి. వీటి కొనుగోలుకు వినియోగదారులు ఖర్చుకు వెనుకాడడం లేదు. ప్రస్తుతం పరిశ్రమ విలువ రూ.3,200 కోట్లుంది. ఏటా 24 శాతం వృద్ధి చెందుతోంది. ఇక్కడ మరో విషయమేమంటే ఒక్కో ప్రాంతంలో నీరు ఒక్కోలా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థీకృత రంగ కంపెనీలు విభిన్న రకాల సాంకేతిక పరిజ్ఞానంతో ప్యూరిఫయర్లను రూపొందిస్తున్నాయి. వినియోగదారులు తమ అవసరాన్నిబట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి.



 సామాన్యులకు అందుబాటు ధరలోనే ఇవి లభిస్తున్నాయా?

 వాటర్ ప్యూరిఫయర్లంటేనే మనిషికి కావాల్సిన స్వచ్చమైన నీరు అందించేవి. అలాంటప్పుడు ‘ఖర్చు’ అన్న సమస్యే రాదు. మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచి లభిస్తాయి. ఇక అందుబాటు ధరలో వినూత్న ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు కెంట్ ఎల్లప్పుడూ ముందుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లు నీటిలో ఉన్న చెత్తను మాత్రమే తొలగిస్తాయి. నీళ్లలో కరిగి ఉన్న ఫ్లోరైడ్, ఆర్సినిక్ వంటి కఠిన మాలిన్యాలు తొలిగించి పూర్తిగా స్వచ్చమైన నీరు తయారవడం రివర్స్ ఓస్మోసిస్(ఆర్‌వో) ప్రత్యేకత. ఆర్‌వో మాదిరిగా పనిచేసే గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్‌ను రూపొందిస్తున్నాం. సామాన్యుడు కొనగలిగేలా ధర ఉంటుంది.



 ఇంకా ఎలాంటి ఉత్పత్తులను తేబోతున్నారు?

 సాధారణంగా ఆర్‌వో విధానంలో 75 శాతం నీరు వృధా అవుతుంది. నీరు ఏమాత్రం వృధా కాకుండా పనిచేసే ఆర్‌వో వాటర్ ప్యూరిఫయర్లను భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసి మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తున్నాం. మా ఫోకస్ కూడా ఈ విభాగంపైనే. మరిన్ని ఉత్పాదనలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాం. కూరగాయలు, పండ్ల కోసం కూడా ప్యూరిఫయర్లను అందుబాటులోకి తెచ్చాం. ఆర్‌వో, అల్ట్రాఫిల్ట్రేషన్, అల్ట్రావయోలెట్, టోటల్ డిస్సాల్వ్‌డ్ సాలిడ్స్ నియంత్రణ కలిగిన ఒకే ప్యూరిఫయర్‌ను రూపొందించాం. వీటికి పేటెంటు ఉంది. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో పోటీలో నిలిచేందుకు ఈ ఉత్పాదనలు దోహదం చేస్తున్నాయి.



 ఆదాయం ఎంత ఆశిస్తున్నారు?

 కెంట్ వాటర్ ప్యూరిఫయర్లు రూ.1,500 నుంచి లభిస్తున్నాయి. ఆర్‌వో విభాగంలో కెంట్‌కు 40 శాతం మార్కెట్ వాటా ఉంది. మా ఆదాయంలో ఈ విభాగం నుంచి 70-80 శాతం సమకూరుతోంది. 2013-14లో రూ.450 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు ఆశిస్తున్నాం. ఇరాక్, దుబాయ్, బంగ్లాదేశ్, నేపాల్, కెన్యా తదితర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మూడేళ్లలో ఎగుమతుల వాటా మొత్తం ఆదాయంలో 15 శాతానికి చేరుకుంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top