ఇన్ఫోసిస్‌కి.. సిక్కా షాక్!

ఇన్ఫోసిస్‌కి.. సిక్కా షాక్!


 సీఈఓ, ఎండీ పదవికి అర్ధంతరంగా గుడ్‌బై...

►  పదేపదే నిరాధార, కుట్రపూరిత ఆరోపణలవల్లేనని వెల్లడి

► రాజీనామాకు నారాయణమూర్తే కారణమన్న ఇన్ఫీ బోర్డు

► తాత్కాలిక చీఫ్‌గా యూబీ ప్రవీణ్‌రావుకు బాధ్యతలు

► పూర్తిస్థాయి సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి డెడ్‌లైన్‌

► అప్పటివరకూ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌గా సిక్కా...

► 13 శాతంపైగా కుప్పకూలిన షేరు ధర...  




దేశీ కార్పొరేట్‌ రంగంలో టాటా–మిస్త్రీ వార్‌ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండగా... మరో ఉరుములేని పిడుగు పడింది. రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లకు, యాజమాన్యానికి మధ్య నడుస్తున్న తీవ్ర పోరులో కీలక వికెట్‌ పడింది. కంపెనీ సీఈఓ, ఎండీ విశాల్‌ సిక్కా తన పదవికి అర్థంతరంగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనపై ఇష్టానుసారంగా పదేపదే నిరాధార, కుట్రపూరిత ఆరోపణలు చేయడంవల్లే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగుతున్నానని సిక్కా స్పష్టం చేశారు.


కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన నారాయణమూర్తి గుప్పిస్తున్న ఆరోపణలే సిక్కా గుడ్‌బైకి కారణమంటూ ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు ఎటాక్‌ ప్రారంభించింది. బోర్డు చేసిన నిరాధార ఆరోపణలపై తగిన సమయంలో, తగిన విధంగా స్పందిస్తానని.. ఇప్పుడు మాట్లాడితే తనకు అగౌరవమంటూ మూర్తి తిప్పికొట్టారు. మొత్తంమీద ఏరికోరి తొలి ప్రమోటరేతర సీఈఓగా మూర్తి బృందం తీసుకొచ్చిన సిక్కాను తొలగించడంలో ప్రమోటర్లు ఒకరకంగా విజయం సాధించినట్లే. అయితే, దేశంలో కార్పొరేట్‌ నైతిక నియమావళికి ఒకప్పుడు మారుపేరుగా నిలిచిన ఇన్ఫీలో ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం.



న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రకటనతో ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. కంపెనీ సీఈఓ, ఎండీ విశాల్‌ సిక్కా అనూహ్యంగా గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తనపై పదేపదే వ్యక్తిగతంగా మాటల దాడి చేయడంతోపాటు నిరాధార ఆరోపణలు గుప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని.. అందుకే ఈ రాజీనా మా అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, నేరుగా నారాయణమూర్తి పేరును ఎక్కడా ఆయన ప్రస్తావించలేదు. సిక్కా రాజీనామాను ఆమోదించామని.. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) యూబీ ప్రవీణ్‌రావుకు తక్షణం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది.


ఇక పూర్తి స్థాయి సీఈఓ–ఎండీని నియమించేందుకు 2018, మార్చి 31ని బోర్డు డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. అప్పటివరకూ బాధ్యతల మార్పిడి సజావుగా సాగడం కోసం సిక్కా కంపెనీకి చేదోడుగా ఉంటారని తెలిపింది. ఆయన ఇకపై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–చైర్మన్‌ హోదాలో కొనసాగుతారని... వార్షిక వేతనం ఒక డాలరు మాత్రమే తీసుకుంటారని కంపెనీ బోర్డు వివరించింది. కాగా, ఇన్ఫీ దృక్పథం, సంస్కృతికి తగిన సీఈఓను ఎంపిక చేయడంపైనే బోర్డు ఇక ప్రధానంగా దృష్టిపెడుతుందని ఇన్ఫీ సహ–చైర్మన్‌ రవి వెంకటేశన్‌ పేర్కొన్నారు. సీఈఓ పదవి రేసులో తాను ఉండబోనని స్పష్టం చేశారు.



ప్రమోటర్లతో ఏడాదిగా నడుస్తున్న వార్‌...

ప్రస్తుతం నారాయణమూర్తి సహా ఇన్ఫీ సహ–ప్రమోటర్లందరికీ కలిపి కంపెనీలో 12.75 శాతం వాటా ఉంది. ఒక్క నారాయణమూర్తికి 3.35 శాతం మేర వాటా ఉన్నట్లు తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, సిక్కాను ఎలాగైనా సాగనంపాలన్న ఉద్దేశంతోనే గత ఏడాదికాలంగా ఆయన నిర్ణయాలపై మాజీలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూవస్తున్నారు. ప్రధానంగా సిక్కా నేతృత్వంలో జరిగిన కంపెనీల కొనుగోలు నిర్ణయాలతో పాటు సిక్కా ఇతరత్రా ఎగ్జిక్యూటివ్‌లకు భారీ వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని కూడా మూర్తి సహా కొందరు ప్రమోటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉదంతంపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు కూడా.


కంపెనీలో కార్పొరేట్‌ నైతిక నియమావళి(గవర్నెన్స్‌) లోపించిందంటూ స్వయంగా మూర్తి చేసిన ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. అన్నింటికంటే ప్రధానంగా మూర్తి ఇటీవలే బోర్డు డైరెక్టర్లకు రాసిన ఒక లేఖ(ఇది మీడియాకు లీకైంది) సిక్కా గుడ్‌బైకి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌ బోర్డులోని కొందరు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు సిక్కా సీఈఓ పోస్టుకు పనికిరాడని.. సీటీఓగా సరిపోతాడంటూ తనకు చెప్పారని మూర్తి ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన పనాయా అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఇన్ఫోసిస్‌ అధిక విలువకు కంపెనీ కొనుగోలు చేసిందని.. ఈ డీల్‌లో కంపెనీకి చెందిన కొందరు ఎగ్జిక్యూటివ్‌లు లబ్ధి పొందారని ఆరోపిస్తూ కొందరు ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్త సెబీ, అమెరికా నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీకి కూడా లేఖలు రాయడం తర్వాత వెలుగులోకి వచ్చింది.


దీనిపై జరిగిన స్వతంత్ర దర్యాప్తులో ఎలాంటి అవకతవకలూ చోటుచేసుకోలేదని తేలింది. అయినప్పటికీ.. దరాప్తు నివేదికను మొత్తాన్ని బహిరంగపరచాలని మూర్తి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి ఇన్ఫీబోర్డు నిరాకరించింది. భారీ నగదు నిల్వలను(దాదాపు రూ.39,000 కోట్లు) వాటాదారులకు పంచాలం టూ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి  ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దీంతో నేడు(శనివారం)  బైబ్యాక్‌పై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఇంతలోనే సిక్కా అనూహ్య రాజీనామా వార్తతో ఐటీ రంగంతోపాటు యావత్‌ కార్పరేట్‌ ఇండియా ఆశ్చర్యానికి గురైంది.



రూ.22,500 కోట్లు ఆవిరి...

సిక్కా ఆకస్మిక రాజీనామాతో ఇన్ఫీ షేరు కకావికలం అయింది. శుక్రవారం బీఎస్‌ఈలో 13 శాతంపైగానే కుప్పకూలి రూ.884కి పడిపోయింది. ఇది ఏడాది కనిష్టస్థాయి కూడా. చివరకు దాదాపు 10 శాతం నష్టంతో రూ.923 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,519 కోట్లు ఆవిరై... రూ.2,12,033 కోట్లకు దిగజారింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెండు ఎక్సే్ఛంజీల్లో కలిపి అనూహ్య స్థాయిలో 9 కోట్ల మేర షేర్లు చేతులుమారడం గమనార్హం. కాగా, బైబ్యాక్‌ వార్తలతో గురువారం ఇన్ఫీ షేరు 5 శాతంపైగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మర్నాడే ఈ మహా పతనం చోటుచేసుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top