అంతా మూర్తే చేశారు..!

అంతా మూర్తే చేశారు..!


ఇన్ఫీ బోర్డు ఆరోపణ

సిక్కాకు బాసట




సిక్కా వైదొలగడానికి నారాయణమూర్తే కారణమంటూ ఇన్ఫీబోర్డు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. సిక్కా పనితీరు చాలా అద్భుతంగా ఉందని ఆయనకు బాసటగా నిలిచింది. అంతేకాదు కంపెనీలో మూర్తి సహా మరే ఇతర సహ–వ్యవస్థాపకులకు మళ్లీ చోటుకల్పించే అవకాశాల్లేవంటూ తేల్చిచెప్పడం గమనార్హం. సిక్కా రాజీనామా నేపథ్యంలో బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నారాయణమూర్తి బోర్డుకు రాసిన లేఖ పలు మీడియా సంస్థలకు కూడా నేరుగా వెళ్లింది. ఈ లేఖలో బోర్డు, యాజమాన్యం సమగ్రతను దెబ్బతీసేవిధంగా వ్యాఖ్యలు చేయడంతోపాటు కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు దిగజారాయంటూ మూర్తి ఆరోపణలు గుప్పించారు. అయితే, ఇవన్నీ పూర్తిగా నిరాధారం.


ఆయన పదేపదే అసంబద్ధమైన డిమాండ్‌లు చేస్తూ వస్తున్నారు. కంపెనీలో పటిష్టమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను కోరుకునే మూర్తి దీనికి విరుద్ధంగా వ్యవహరించారు’ అని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ‘ప్రమోటర్లు లేవనెత్తిన అంశాలపై చట్టపరిధిలో కంపెనీ స్వతంత్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పరిష్కారం కోసం  కృషిచేశాం. అయితే, మూర్తి చర్యలు, డిమాండ్‌లు కంపెనీ ప్రతిష్ట, సమగ్రతను దెబ్బతీశాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం’ అని బోర్డు వ్యాఖ్యానించింది.


‘కంపెనీ మేనేజ్‌మెంట్‌లోని సభ్యులపై పదేపదే ఇష్టానుసారంగా నిరాధార ఆరోపణలు చేయడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీనివల్ల కంపెనీ ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినడంతోపాటు ప్రతిభాశీలి అయిన సీఈఓను కోల్పోయేలా చేశారు’ అని ఇన్ఫీ సహ–చైర్మన్‌ రవి వెంకటేశన్‌ పేర్కొన్నారు. కాగా, పనయా డీల్‌పై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ మూర్తి చేసిన తాజా ఆరోపణలను ఇన్ఫీ చైర్మన్‌ ఆర్‌.శేషసాయి కొట్టిపారేశారు. కాగా, మూర్తిపై చట్టపరమైన చర్యలను శేషసాయి, రవి వెంకటేశన్‌లు కొట్టిపారేశారు.



సరైన సమయంలో సమాధానమిస్తా

తాను పదేపదే నిరాధార ఆరోపణలు చేయడం వల్లే సిక్కా గుడ్‌బై చెప్పారంటూ ఇన్ఫీ బోర్డు చేసిన వ్యాఖ్యలపై నారాయణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ‘నాకు ఎలాంటి డబ్బు ఆశలేదు. అదేవిధంగా నాకు, నా పిల్లలకుగానీ అధికార వ్యామోహం కూడా లేదు. ఎంతో శ్రమకోర్చి ఉన్నత ప్రమాణాలతో స్థాపించిన ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ దిగజారుతోందనేదే నా ఆందోళనంతా.


అదేవిధంగా కంపెనీ మేనేజ్‌మెంట్‌ చేపట్టిన కొన్ని కొనుగోళ్లు(పనయా ప్రధానంగా)పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తులు కూడా సరిగ్గా జరగలేదు. తూతూమంత్రంగా చేసి చేతులుదులుపుకున్నారు. నాపై బోర్డు చేసిన ఆరోపణలన్నింటికీ తగిన సమయంలో తగిన వేదికపై తగిన విధంగా సమాధానం ఇస్తా. ఇప్పుడు మాట్లాడితే నాకు అగౌరవం’ అని మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



నిరాధార ఆరోపణలతో కలత చెందా: సిక్కా

గత కొద్ది నెలలుగా తనపై నిరాధార, కుట్రపూరితమైన వ్యక్తిగత దూషణలు పదేపదే జరగడం దారుణమని.. ఈ ఉదంతంతో తీవ్రంగా కలతచెందినట్లు సిక్కా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, మూర్తితోసహా ఎవరిపేరునూ ఆయన ప్రస్తావించలేదు. ‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తుల్లో తప్పని తేలింది. కంపెనీలో జరుగుతున్న గొప్ప మార్పుకు మద్దతుగా నిలవాల్సిన కొంతరు కీలక వ్యక్తులే ఈ విధమైన వ్యక్తిగత ఆరోపణలను గుప్పించడం దారుణం’ అని సిక్కా వ్యాఖ్యానించారు.


అదేవిధంగా మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సాల్‌కు ఇచ్చిన వీడ్కోలు ప్యాకేజీ భారీగా ఇచ్చారంటూ అదేపనిగా పలుమార్లు ఆరోపించడం, పనయా డీల్‌ను తప్పుబట్టడం గత కొద్ది నెలలుగా రోతపుట్టించే స్థాయికి చేరింది. ఈ రాద్ధాంతం కారణంగా నేను కొన్ని వందల గంటల విలువైన సమయాన్ని దీనిపై అనవసరంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇక దీనికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నా’ అని సిక్కా వివరించారు.


కాగా, రాజీనామాపై వివరణ ఇస్తూ కంపెనీ ఉద్యోగులకు కూడా సిక్కా ఒక ఈమెయిల్‌ పంపారు. ‘జీవితం చాలా చిన్నది. అనవసర విషయాలపై బహిరంగంగా ఇలా వాదోపవాదనలు చేసుకోవడం ద్వారా మనం చేసే పనిపై దృష్టిని పెట్టలేకపోవడం కంటే దుర్భరం మరొకటి ఉండదు. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతుంది. కంపెనీ భవిష్యత్తు వృద్ధికి అవసరమైన భారీ మార్పునకు నా వంతు చేయూతనందించేందుకు సిద్ధమే. అయితే, ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతాన్ని దాటుకొని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది’ అని సిక్కా పేర్కొన్నారు.



గ్లోబల్‌ టెకీ.. సిక్కా

యాభై ఏళ్ల విశాల్‌ సిక్కా 2014 ఆగస్ట్‌ 1న ఇన్ఫీలో తొలి నాన్‌–ప్రమోటర్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ముచ్చటగా మూడేళ్లుమాత్రమే ఆ పదవిలో కొనసాగిన సిక్కాకు ఐటీ రంగంలో అత్యుత్తమ కెరీర్‌ ఉంది.  

♦ ఆర్టిఫీసియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఆయన ప్రతిభకుగాను స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ 1996లో సిక్కాకు పీహెచ్‌డీ ప్రదానం చేసింది.

♦  సిక్కా నెలకొల్పిన రెండు స్టార్టప్‌లనూ ఇతర కంపెనీలు భారీ మొత్తానికే చేజిక్కించుకున్నాయి.

♦ 2002లో జర్మనీ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి ఎస్‌ఏపీలో జాయిన్‌ అయ్యారు. 2007లో కంపెనీ తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ) పదవిని దక్కించుకున్నారు.

♦ విశాల్‌ సిక్కా... మూడేళ్ల ప్రస్థానంలో ఇన్ఫోసిస్‌ ఆదాయం 25 శాతం మేర ఎగబాకింది. అంతేకాదు ఏఐతో పాటు క్లౌడ్‌ ఇతరత్రా డిజిటల్‌ టెక్నాలజీలపైపు ఇన్ఫీ దృష్టిసారించేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

♦  2014లో ఐదేళ్లపాటు  సీఈఓగా నియమించారు. అయితే, సిక్కా పనితీరుపై నమ్మకం ఉంచుతూ కంపెనీ బోర్డు 2021 వరకూ(మరోరెండేళ్లు) సీఈఓగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top