పెట్రోల్ బంకుల భారీ దందా: షాకింగ్ విషయాలు!

పెట్రోల్ బంకుల భారీ దందా: షాకింగ్ విషయాలు! - Sakshi

లక్నో: పెట్రోల్ బంకుల భారీ దందా ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. 1000కి పైగా ప్యూయల్ స్టేషన్లలో చిప్ ఆధారిత డివైజ్ ను వాడుతూ భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నాయని వెల్లడైంది. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన రైడ్స్ లో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.  ఈ దందా కేవలం  ఉత్తరప్రదేశ్ లోనే కాక, ఇతర రాష్ట్రాల్లో విజృంభించి ఉందని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణలో తెలిసింది. ఇప్పటికే ఈ దందాకు సంబంధించి 23 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయగా.. రాష్ట్ర రాజధాని పరిధిలోని పలు పెట్రోల్ బంకులను సీల్ చేశారు.

 

అరెస్టు అయిన వారిలో తొమ్మిది మంది పెట్రోల్ బంకు యజమానులు, తొమ్మిది మంది మేనేజర్లు, నలుగురు ఉద్యోగులు, ఎలక్ట్రిషియన్ ఉన్నారు. ఇంధన అవుట్ పుట్ ప్రజలకు తక్కువగా ఇవ్వడానికి చిప్ ను ఇన్ స్టాల్ చేస్తున్న ముఖ్యుడు ఎలక్ట్రిషియన్ రాజేందర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇతనే పెట్రోల్ బంకుల్లో చిప్ లను ఇన్ స్టాల్ చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని ఇన్ స్టాల్ చేసినట్టు చెప్పాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరవింద్ చతుర్వేది తెలిపారు. 

 

పెట్రోల్ బంకులు చేస్తున్న ఈ మూకుమ్మడి అక్రమాలపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు, డీజీపీ సుల్ఖాన్ సింగ్ ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసిన వారి విచారణలో ఈ అక్రమాల వెనుక పెద్ద రాకెటే ఉందని వెల్లడైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది విస్తరించి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజుల్లో దాడులు ప్రారంభించనున్నారు. పెట్రోల్ బంకులు చిప్ ను వాడుతూ తక్కువ పెట్రోల్ పోసి, ట్యాంకు ఫుల్ అయినట్టు చెబుతున్నాయని విచారణలో తెలిసినట్టు అధికారులు తెలిపారు.

 

దీంతో పెట్రోల్ బంకులు ప్రైమ్ ఏరియాలో నెలకు కనీసం 12 లక్షల నుంచి 15 లక్షల మేర అదనంగా సొమ్మును ఆర్జిస్తున్నట్టు అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం ఆరు నుంచి ఏడు లక్షలు అదనంగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ప్యూయల్ ఫిల్లింగ్ స్టేషనల్లో ఈ చిప్ ను ఇన్ స్టాల్ చేసినట్టు తెలిసింది.  అధికారులు జరిపిన దాడుల్లో పలు మిషన్లను, చిప్ లను, రిమోట్ కంట్రోల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అరెస్టు అయిన వారిలో రాజేందర్, వీరేంద్ర సింగ్ భడోరియా,షేర్డ్ చంద్ర వైశ్య, రాజన్ అవస్థి, అశోక్ కుమార్ పాల్, అనూప్ మిట్టల్, హసీబ్ అహ్మద్, గోవింద్ పాండే, ప్రేమ్ కుమార్ ఓజ్హ ఉన్నారు. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top