మార్కెట్లోకి టీవీఎస్ స్కూటీ జెస్ట్


చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటీ మోడల్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్, స్కూటీ జెస్ట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 110 సీసీ స్కూటర్ ధర రూ.42,300(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) అని  టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ చెప్పారు. ఈ స్కూటర్ 62 కి.మీ. మైలేజీనిస్తుందని పేర్కొన్నారు.  గత 15 ఏళ్లుగా స్కూటీ బ్రాండ్ అందరికీ సుపరిచితమేనని, ఇప్పుడందిస్తున్న స్కూటీ జెస్ట్ స్కూటీ స్థాయిని  ఒక మెట్టు పైకి తీసుకెళుతుందని వివరించారు. మరింత పవర్, మరింత సౌకర్యం కావాలనుకునే వారి కోసం ఈ స్కూటీ జెస్ట్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు.



గతంలో విడుదల చేసిన స్కూటీ పెప్ ప్లస్, స్కూటీ స్ట్రీక్ విక్రయాలను కొనసాగిస్తామని వివరించారు. తమ ఇతర స్కూటర్లు-జూపిటర్, వెగోలకు ఈ స్కూటీ జెస్ట్ పోటీ కాదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. వెగో స్కూటర్‌ను ఒక్క బిడ్డ ఉన్న వివాహితుల కోసం రూపొందించామని, అలాగే స్కూటీ జెస్ట్‌ను 18 నుంచి 25 ఏళ్ల యువతులను లక్ష్యంగా పెట్టుకొని అందిస్తున్నామని వివరించారు. ఈ మూడు స్కూటర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినప్పటికీ, దేనికదే ప్రత్యేకమైనవేనని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో విక్టర్ మోటార్‌సైకిల్‌లో కొత్త వేరియంట్‌ను అందిస్తామని వివరించారు.



 రూ.70 కోట్ల పెట్టుబడులు

 భారత వినియోగదారుల అభిరుచులకనుగుణంగా టూ, త్రీ వీలర్లను అందిస్తున్నామని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తేవాలనే కంపెనీ వ్యూహంలో భాగంగా ఈ 110 సీసీ స్కూటీ జెస్ట్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ  గత క్వార్టర్‌లో ఈ కంపెనీ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం తమ మార్కెట్ వాటా 15 శాతమని, దీనిని 18 శాతానికి పెంచుకోవాలనుకుంటున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈవో కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top