రికార్డు కొట్టేసిన 'చొక్కా'

రికార్డు కొట్టేసిన 'చొక్కా' - Sakshi


ముంబై:  ఒళ్లంతా బంగారంతో.. నడిచొచ్చే  బంగారు  కొండలా మురిపించిన పంకజ్ పరేఖ్ గుర్తున్నారా?  కోట్ల రూపాయల విలువ చేసే బంగారు చొక్కా, చుట్టూరా మందీ మార్బలంతో అందరీ దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్రకు  చెందిన పంకజ్ పరేఖ్ (47) ఓ అరుదైన  రికార్డును  సొంతం చేసుకున్నాడు.  గోల్డ్‌మేన్ అని  సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే పరేఖ్ కోటిన్నర రూపాయల విలువ చేసే బంగారు చొక్కాతో బంగారం లాంటి  రికార్డును దక్కించుకున్నాడు. 4.10 గ్రా. కేజీల  బంగారు   చొక్కా  ఓనర్ గా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ప్లేస్ కొట్టేశాడు.





ఈ విషయం తనకు అస్సలు నమ్మశక్యంగా లేదంటూ  పరేఖ్  సంతోషం వ్యక్తం చేశాడు.  తాను సాధించిన ఈ గిన్నిస్ రికార్డు తో ప్రపంచవ్యాప్తంగా తన గ్రామానికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎంపిక చేసిన   20 మంది కళాకారుల బృందం , 18, 22 క్యారెట్ల మేలిమి బంగారు పోగులతో  3,200  గంటలపాటు  కష్టపడి దీన్ని తయారు చేశారని తెలిపాడు.



బంగారంతో  తయారైనప్పటికీ , చొక్కా  చాలా స్మూత్ గా,  సౌకర్యవంతంగా ఉందని పరేఖ్ తెలిపారు. అంతేకాదు ఇది చర్మానికి గుచ్చుకోకుండా దీనికి లోపల  గుడ్డతో  పలుచని లైనింగ్ అమర్చారు.  శుభ్రంచేసుకోవడం సహా , మరమ్మతులు  చేసే సదుపాయం ఉందన్నారు.  దీనికి లైఫ్ టైమ్ గ్యారంటీ కూడా ఉందన్నారు. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పరేఖ్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. పాతికేళ్ల క్రితం తమ పెళ్లి విషయంలో పెళ్లి కూతురికంటే  ఎక్కువ  బంగారం  ధరించి అనేక మంది అతిధులు  ఆశ్చర్యపోయారంటూ గర్తు చేసుకున్నాడు. తనభార్య బిడ్డల సంక్షేమాన్ని, పిల్లల చదువును శ్రద్ధగా చూసుకుంటూనే తానీ ఘనత సాధించానంటూ మురిసిపోయాడు  పరేఖ్.  అన్నట్టు ఈబంగారు బాబు ను చూసే గోల్డెన్  చాన్స్ గతంలో హైదరాబాద్‌కు దక్కింది. ఆ మధ్య ఈ గోల్డ్ మాన్ హిమాయత్ నగరలో జరిగిన ఓ   వేడుకలో కనువిందు చేసి మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.





 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top