టెక్‌మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్

టెక్‌మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్


న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా.. ఉద్యోగార్థుల కోసం జాతీయ స్థాయిలో మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో సరల్ రోజ్‌గార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు బుధవారం ప్రకటించింది. రూ. 50 వెచ్చించి ఈ సరల్ రోజ్‌గార్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సర్వీసులను పొందవచ్చని పేర్కొంది. తదనంతరం 1860-180-1100 నంబర్‌కు డయల్ చేసి తమకు నచ్చిన భాషలో వాయిస్‌కాల్ ద్వారా భారత్‌లోని ఏ ప్రదేశం నుంచైనా ఉద్యోగార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చని టెక్ మహీంద్రా మొబిలిటీ బిజినెస్ హెడ్ జగదీశ్ మిత్రా వెల్లడించారు.



 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, గ్రాడ్యుయేట్ కంటే కింది స్థాయిలోని(దినసరి వేతనంతో పనిచేసే వర్కర్లు, ఎంట్రీలెవెల్) కొలువుల కోసం వేచిచూసే అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తగా ఈ మొబైల్ జాబ్ మార్కెట్ ప్లేస్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్పొరేట్, ప్రధాన కంపెనీలకు తమ అర్హతలను సరైన రీతిలో తెలియజేసేందుకు వీలుగా తొలిసారి రెస్యూమెలను రూపొందించుకునేవారికి తాము సహకారం కూడా అందిస్తామని మిత్రా చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్‌ఎంఈలు)/ఎంట్రప్రెన్యూర్స్ కూడా ఈ సేవల ద్వారా రిజిస్టర్ అయినవారికి వాయిస్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఉందని ఆయన వివరించారు.



ప్రస్తుతం 100కుపైగా ఉద్యోగ విభాగాల్లో లక్షకు పైబడి జాబ్స్ సరల్ రోజ్‌గార్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టెక్ మహీంద్రా వైస్‌ప్రెసిడెంట్(మొబిలిటీ, వ్యాస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో) వివేక్ చందోక్ చెప్పారు. రిటైల్, అకౌంటింగ్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషీన్ ఆపరేటర్, కుక్స్, సెక్యూరిటీగార్డులు, డెలివరీ బాయ్స్ వంటి కేటగిరీల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా టెలికం రీచార్జ్ సేవలందించే రిటైల్ అవుట్‌లెట్స్ వద్ద ఈ సరల్ రోజ్‌గార్ కార్డులు లభిస్తాయని చందోక్ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top