ట్యాక్స్ రిటర్న్ సందేహాలను నివృత్తి చేసుకోండి

ట్యాక్స్ రిటర్న్ సందేహాలను నివృత్తి చేసుకోండి - Sakshi


రిటర్నులు దాఖలుకు ఈ నెలాఖరుతో గడువు పూర్తవుతుంది. త్వరపడి మీ బాధ్యతలను నిర్వర్తించండి. మనంతట మనమే మన ఆదాయ పరిమితి దాటితే స్వచ్ఛందంగా రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో అసెసీలకు అవగాహన పెంపొందించే దిశగా డిపార్ట్‌మెంట్ వారు ఎన్నో చర్యలు చేపట్టారు. పత్రికల్లో, టీవీల్లో ఈ మేరకు రిటర్నులు సకాలంలో వేయండంటూ ప్రకటనలు ఇచ్చారు. అంతేకాకుండా ఒక వెబ్‌సైట్ నిర్వహిస్తూ..ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అందులో భాగంగా గతవారం కొన్ని ప్రశ్నలు.. వాటికి సమాధానాలు విడుదల చేశారు.

 

* ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో సమస్త సమాచారం  

* మీ రిటర్నులు మీరే దాఖలు చేసుకోవచ్చు




సాధారణంగా అసెసీలకు సందేహాలుంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ అంటేనే.. ఒకరకమైన భయం. ఎన్నో అపోహలు. ఆపై ఏవేవో ఆలోచనలు. రిటర్నులు ఎలా వేయాలి? ఏ ఫారం తీసుకోవాలి? ఎవరు వేయాలి? ఎక్కడ వేయాలి? గడువు తేదీ? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అలాగే పాన్ ఉంటే వేయాలా? ప్రతి సంవత్సరం వేయాలా? పన్ను కడితే వేయాలా? పన్ను భారం లేకపోతే అవసరం లేదా? ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సైట్‌లో సమాధానమిచ్చారు. ప్రశ్నలను పూర్తి సమాచారంతో సమగ్రమైన వివరాలతో చిన్న చిన్న ఉదాహరణలతో వివరించారు. ఒక్కొక్క ప్రశ్న చదువుతుంటే మన ల్ని దృష్టిలో పెట్టుకొనే వేశారా? అనిపిస్తుంది.

 

సమాధానాల్లో భాగంగా వివిధ శ్లాబులు, పన్ను రిటర్నులు పొందుపరిచారు. ఏ ఆదాయం ఉంటే ఏ ఫారం వేయాలి? లేదా ఎవరు ఏ ఫారం వేయాలి? ‘ఎవరు’ అన్న ప్రశ్నకి ఆ అసెసీకి ఏయే ఆదాయం ఉందని అడగాలి?. జీతం/పెన్షన్; ఒక ఇంటి మీదే ఆదాయం (నష్టం కాకుండా); ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్ల మీద ఆదాయం; ఇతర ఆదాయాలు (లాటరీ, గుర్రప్పందాలు కాకుండా); క్యాపిటల్ గెయిన్స్; వ్యాపారం మీద లాభం/నష్టం; వృత్తి మీద లాభనష్టాలు లాంటివి. ఏ ఫారం మీద విదేశీ ఆస్తులు/ఆదాయం వేయాలో పేర్కొన్నారు. కంపెనీలు, ట్రస్టులు, సొసైటీలు ఇలా నిర్దిష్టంగా విభజించారు. ఇదికాకుండా ఏ ఏ ఫారంలో ఏయే ఆదాయాలు చూపించాలి అని ఎంతో వివరంగా చెప్పారు.



రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?. ఇన్‌కమ్ ట్యాక్ రిటర్నులు, ఈ-ఫైలింగ్ ఎలా వేయాలో తెలియజేశారు. రకరకాల పద్ధతులతోపాటు ఎలా వెరిఫై చేయాలో కూడా చెప్పారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఉద్యోగస్తుల విషయంలో యాజమాన్యాలు తప్పులు చేస్తూ ఉంటాయి. వీటిని సరిదిద్దుకోవాలి. వాటినన్నింటినీ సైట్‌లో వివరించారు. పాస్‌వర్డ్ మరచిపోతే కొత్త పాస్‌వర్డ్‌ను ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపారు. అందుకే వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను దర్శించండి. వివరాలు అర్థం చేసుకోండి. మీ రిటర్నులను మీరే దాఖలు చేసుకోవచ్చు.

- ట్యాక్సేషన్ నిపుణులు

కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి , కె.వి.ఎన్ లావణ్య

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top