‘టాటా’కు అమెరికా జేజేలు

‘టాటా’కు అమెరికా జేజేలు - Sakshi


వాషింగ్టన్: అమెరికాలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్న భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా గ్రూప్‌ను ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పొగడ్తలతో ముంచెత్తారు. ‘అమెరికాలో వాహన విక్రయాలు, డిజైన్లు విస్తరించడం ద్వారా టాటా గ్రూప్ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తోందో చూడండి. ఈ దేశంలో ఆ సంస్థకు ఇప్పటికే 24 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు..’ అని వాషింగ్టన్‌లో జరిగిన ఓ సదస్సులో ఆయన అన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన 12 విభిన్న కంపెనీలు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు.

 

జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ, గుడ్‌ఎర్త్, ఎయిట్ ఓ క్లాక్ కాఫీ వంటి ప్రసిద్ధిచెందిన బ్రాండ్లు టాటాల సొంతమని పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు అమెరికాలో దాదాపు లక్ష ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఇండియాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అమెరికన్ మోటార్ కంపెనీ ఫోర్డ్‌ను కూడా కెర్రీ ప్రశంసించారు. ఇండియా, అమెరికాల మధ్య వార్షిక వాణిజ్య పరిమాణాన్ని 10 వేల కోట్ల డాలర్ల నుంచి 50 వేల కోట్ల డాలర్లకు పెంచడానికి కృషిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

 

మూడేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మూడేళ్లలో 35 బిలియన్ డాలర్లు(రూ. 2.10 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దశాబ్ద కాలంలో మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రీత్యా ప్రపంచంలోని టాప్-25 కంపెనీల సరసన చేరే అవకాశమున్నట్లు భావిస్తోంది. విజన్ 2025లో భాగంగా వేసుకున్న ప్రణాళికలను టాటా గ్రూప్ వార్షిక నాయకత్వ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించిన గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆవిష్కరించారు.

 

దీనిలో భాగంగా మాతృ సంస్థను కేంద్రంగా చేసుకుని గ్రూప్‌లోని సంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని, పరస్పర సహకారంతో అభివృద్ధి బాటన నడిపించాలని భవిష్యత్ ప్రణాళికలు వేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 2025కల్లా కస్టమర్లు, తదితర సంస్థలకు అత్యుత్తమ సేవలు, సర్వీసులను అందించడంలో టాటా గ్రూప్‌కున్న కట్టుబాటు ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి అవగతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

తొలిసారి రూ. 6 లక్షల కోట్ల ఆదాయం

గతేడాది(2013-14)లో గ్రూప్ మొత్తం ఆదాయం తొలిసారి 100 బిలియన్ డాలర్ల(రూ. 6.24 లక్షల కోట్లు)ను దాటడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top