స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ


 ఫైనాన్షియల్‌ బేసిక్స్‌..  

లిక్విడ్‌ ఫండ్స్‌ చిన్న ఇన్వెస్టర్లకు అనువేనా?


దేశంలో లిక్విడ్‌ ఫండ్స్‌ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో పెద్ద, సంస్థాగత ఇన్వెస్టర్లే వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసేవారు. గతంలో వీటిని రిటైల్‌ ఇన్వెస్టర్లకు చేరువ చేద్దామనే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. లిక్విడ్‌ ఫండ్స్‌ అందిస్తోన్న పలు సౌలభ్యాలు, ప్రయోజనాల కారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా వీటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాతో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉండటం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, లిక్విడ్‌ ఫండ్స్‌ అందిస్తున్న ప్రయోజనాలు, డైరెక్ట్‌ ప్లాన్‌లు తేవటం, లిక్విడిటీ వంటి పలు అంశాల వల్ల చిన్న ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. నెఫ్ట్, డైరెక్ట్‌ డెబిట్‌/క్రెడిట్, స్వైప్‌ వంటి పలు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసుల వల్ల వీటి దైనందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యకలాపాలు సులభతరమయ్యాయి.



లిక్విడ్‌ ఫండ్స్‌ ప్రత్యేకతలు

ఇవి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కిందకు వస్తాయి. ఈ ఫండ్స్‌ మన డబ్బుల్ని ట్రెజరీ బిల్లులు, గవర్నమెంట్‌ సెక్యూరిటీస్, వాణిజ్య పత్రాలు వంటి స్వల్పకాలిక మనీ మార్కెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటిల్లో రిస్క్, ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. ఎగ్జిట్‌లోడ్‌ భారం ఉండదు. తక్కువ మెచ్యూరిటీ కాలం వల్ల వీటికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో లాకిన్‌ పీరియడ్‌ ఉండదు.



సియట్‌

కొనొచ్చు

బ్రోకరేజ్‌  సంస్థ: మోతిలాల్‌  ఓస్వాల్,    ప్రస్తుత ధర: రూ.1,130

టార్గెట్‌ ధర: రూ.1,406


ఎందుకంటే: ఆర్‌పీ గోయెంకా గ్రూప్‌లో ప్రధాన కంపెనీ. ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ ఇదే. 4,500కు పైబడిన డీలర్లతో, 33 రీజినల్‌ ఆఫీసులతో, 400కు పైగా ఫ్రాంచైజీలతో, 6 ప్లాంట్లతో, 250కు పైగా డిస్ట్రిబ్యూటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్జిన్‌లు తక్కువగా ఉండే బస్సు, ట్రక్కు టైర్ల తయారీ నుంచి మార్జిన్లు అధికంగా ఉండే టూ వీలర్, ప్రయాణికుల వాహన టైర్ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. మార్కెటింగ్, బ్రాండింగ్‌పై అధికంగా వ్యయం చేసింది. దీంతో 2010–11లో 8 శాతంగా ఉన్న 2వీలర్‌ టైర్ల మార్కెట్‌ వాటా గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతానికి (ఎంఆర్‌ఎఫ్‌ తర్వాత రెండో స్థానం ఈ కంపెనీదే), ప్రయాణికుల వాహన టైర్ల మార్కెట్‌ వాటా 4 శాతం నుంచి 9 శాతానికి పెరిగాయి. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయంలో టూ వీలర్‌ టైర్ల వాటా 38 శాతానికి, ప్రయాణికుల వాహన టైర్ల వాటా 49 శాతానికి పెరుగుతాయని అంచనా. ఫలితంగా రబ్బర్‌ ధరల్లో ఒడిదుడుకులు వచ్చినా, మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నాయి.   ఈ రెండు సెగ్మెంట్లలో(టూ వీలర్, ప్రయాణికుల వాహనాలు) చైనా టైర్ల నుంచి పోటీ తక్కు వగా ఉండడం కంపెనీకి కలసివస్తోంది. మార్జిన్లు అధికంగా ఉండే ఆఫ్‌–వే టైర్స్‌(ఓహెచ్‌టీ) సెగ్మెంట్‌లో ఇటీవలే ప్రవేశించింది. ఈ ఆఫ్‌–వే టైర్ల వల్ల కంపెనీ ఎగుమతులు బాగా పెరుగుతాయని, మార్జిన్లు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. శ్రీలంక అనుబంధ కంపెనీ  ఏసీహెచ్‌ఎల్‌కు ఆ దేశంలో టైర్ల మార్కెట్‌లో 50 శాతం వాటా ఉంది. ఇబిటా మార్జిన్‌ 25 శాతంగా ఉంది. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం, నికర లాభం 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.



నెస్లే ఇండియా

బ్రోకరేజ్‌  సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్,    ప్రస్తుత ధర: రూ.6,254

టార్గెట్‌ ధర: రూ.7,417


ఎందుకంటే: ఇన్‌స్టంట్‌ నూడుల్స్, చిన్న పిల్లల ఆహార పదార్ధాల సెగ్మెంట్లలలో నెస్లే ఇండియా కంపెనీదే అగ్రస్థానం. ఇన్‌స్టంట్‌ కాఫీ, చాక్లెట్ల సెగ్మెంట్లో రెండో స్థానంలో ఉంది. పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం అధికంగానే ఉన్నప్పటికీ, నెస్లే ఇండియా గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్‌లో మంచి ఆర్థిక ఫలితాలనే ప్రకటించింది. ఆదాయం 16% వృద్దితో రూ.2,261 కోట్లకు పెరిగింది.  పన్ను వ్యయాలు 36% పెరగడం, న్యాయ వివాదాల పరిష్కారం కోసం రూ.81 కోట్ల కేటాయింపులు కారణంగా నికర లాభం రూ.215 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌ మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం ఉందనే అంచనాలతో 2015 జూన్‌లో నిషేధం విధించారు. మ్యాగీ సురక్షితమేనని వివిధ లేబరేటరీల్లో తేలడంతో  అదే ఏడాది నవంబర్‌లో నెస్లే కంపెనీ మ్యాగీ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. దాదాపు ఏడాది తర్వాత కోల్పోయిన మార్కెట్‌ వాటాను మళ్లీ సాధించింది. గత ఏడాది చివరి ఆరు నెలల్లో నెస్లే కంపెనీ– మ్యాగీ, పాలు, చాక్లెట్ల కేటగిరీల్లో 30 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మరో ఐదు కొత్త కేటగిరిల్లోకి– నెస్‌ప్రెస్సో(కాఫీ మెషీన్‌), డాల్సే గస్టో(కాఫీ క్యాప్సూల్‌ సిస్టమ్‌), పెట్‌కేర్, హెల్త్‌కేర్, స్కిన్‌ కేర్‌ల్లోకి ప్రవేశిస్తోంది. బ్రాండ్‌ ఇమేజ్, ప్రచారానికి అధికంగా నిధులు ఖర్చు చేయడం వంటి అంశాల కారణంగా ఈ సెగ్మెంట్లలలో కూడా నెస్లే నిలదొక్కుకోగలదని భావిస్తున్నాం. చాక్లెట్ల కేటగిరిలో క్యాడ్‌బరీస్‌ నుంచి, పాల ఉత్పత్తుల కేటగిరిలో అమూల్, బ్రిటానియాల నుంచి పోటీ పెరుగుతుండడం ప్రతికూలాంశం. మధ్య తరగతి, అధికాదాయం గలవారే అధికంగా ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నందున ఉత్పత్తుల ధరలను పెంచినా, అమ్మకాలు తగ్గకపోవడం కంపెనీకి కలసివచ్చే అంశం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top