వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ఈ ఏడాదే..

వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ఈ ఏడాదే..


 త్వరలో ఉక్కుశాఖ కొత్త పాలసీ



విశాఖలో విలేకరులతో కేంద్ర ఉక్కుశాఖ

 కార్యదర్శి జి. మోహన్‌కుమార్

స్టీల్ ప్లాంట్‌లో గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్, సింటర్ పవర్ ప్లాంట్ ప్రారంభం


 

సాక్షి, విశాఖపట్నం: కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఈ ఏడాదే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి జి.మోహన్ కుమార్ వెల్లడించారు.కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లో తమ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కొనసాగిస్తుందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోనూ దీన్ని అమలుచేస్తామని స్పష్టం చేశారు.ై వెజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో రెండురోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఆర్‌ఐఎన్‌లో రూ.600 కోట్లతో చేపట్టిన  గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్ ఆధునికీకరణ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.

 

 అనంతరం జపాన్‌దేశ సాంకేతిక సహకారంతో రూ.300 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మించిన 20.6 మెగావాట్ల సింటర్ కూలర్ వేస్ట్‌హీట్ రికవరీ పవర్ ప్లాంట్‌ను సైతం మోహన్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ స్టీల్‌ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వెలువడే వృథా వాయువులతో విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం మంచి ప్రయత్నమని అభినందించారు. దేశంలో ఇతర ఉక్కు సంస్థలు కూడా ఇదేబాటలో పయనిస్తే పర్యావరణ కాలుష్యాన్ని నివారించి వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఉక్కు ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయనే ప్రశ్నకు ఇది ఆయా కంపెనీల విధానాలపై ఆధారపడి ఉంటుందని,దీనిపై తామేం చేయలేమన్నారు.

 

స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం కొంతవరకు బాధాకరమేనని, రాజస్థాన్ గనుల అనుమతి రూపంలో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉక్కు ఉత్పత్తి వ్యయం  క్రమేపీ పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించుకోగలిగితేనే ఏ కంపెనీకైనా మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని కంపెనీలకు కలిపి 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, వ్యక్తిగత ఉక్కు వినియోగం తక్కువగా ఉంటున్నందున 80 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ భవిష్యత్‌లో రెండో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అనంతరం ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ మధుసూదన్ ప్రసంగించారు. గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్‌ను ఆధునీకరించడం వలన ఫర్నేస్ ఉత్పత్తి సామర్థ్యం రెండు మిలియన్ టన్నుల నుంచి 2.5 మి లియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వెలువడే వృథా వాయువుల నుంచి సింటర్ పవర్ ప్లాంట్‌ను నిర్మించడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటూ ఇందుకు తోడ్పాటునందించిన జపాన్‌దేశ ప్రతినిధులైన జేపీ స్టీల్ ప్లాన్‌టెక్ కంపెనీ డెరెక్టర్ శొశకు ఉమెజావా, నీడో కంపెనీ ఈడీ ఫ్యుమియో యెడాలను అభినందించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top