జీఎస్‌టీ కనీస పరిమితి రూ.10 లక్షలు

జీఎస్‌టీ కనీస పరిమితి రూ.10 లక్షలు


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కనీస పరిమితిని (థ్రెషోల్డ్ లిమిట్) రూ.25 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గించాలని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పట్టుబట్టారు. ఐదేళ్ల జీఎస్‌టీ పరిహార వ్యవస్థను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని కేంద్రాన్ని కోరారు.



 జీఎస్‌టీ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కొత్త పన్నుల వ్యవస్థ నిర్మాణంపై తాము గత సమావేశంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించనేలేదని కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు.



 పెట్రోలియం, పొగాకు, ఆల్కహాల్ వంటి ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయించాలని మంత్రులు ప్రతిపాదించారు. మినహాయింపుల జాబితాను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు అమల్లో ఉండే పరిహార వ్యవస్థ ఉండాలనీ, దాన్ని కూడా బిల్లులో చేర్చాలనీ కోరారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారాల నుంచి పన్నుల వసూలుకు పాలనాధికారాలే కాకుండా చట్టపరమైన అధికారాలు కూడా ఉండాలని డిమాండ్ చేశారు.



రూ.కోటిన్నర లోపు వ్యాపారాలపై పన్ను మదింపు, ఆడిట్, ఇతర అంశాల్లో జోక్యం వద్దని కేంద్రానికి సిఫార్సు చేశారు. ద్వంద్వ నియంత్రణ విధానం ప్రకారం రూ.1.50 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారుల నుంచి పన్నులను కేంద్రం వసూలు చేస్తుంది. తర్వాత, ఆయా రాష్ట్రాలకు వాటి వాటాలను చెల్లిస్తుంది. కోటిన్నర లోపు టర్నోవర్ ఉండే కంపెనీల నుంచి ట్యాక్సులను రాష్ట్రాలు వసూలు చేసి, కేంద్రానికి దాని వాటాను చెల్లిస్తాయి.





 కమిటీ సిఫార్సుల ప్రకారం రూ.10 లక్షల్లోపు వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారాలపై జీఎస్‌టీ విధించరు. ఈ పరిమితి సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరీ, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.5 లక్షలుగా ఉండాలని నిర్ణయించినట్లు రాథర్ వివరించారు. అనేక రాష్ట్రాల్లో వ్యాట్ కనీస పరిమితి రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top