నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!

నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!


పాత నోట్ల స్థానంలో కొత్తవి చేర్చాలంటే

మే నెల వరకూ సమయం పట్టొచ్చు...

ఆర్థిక విశ్లేషకుల అంచనా...

దీనివల్ల ఎకానమీకి తీవ్ర నష్టమని అభిప్రాయం


ముంబై: పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి.. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడం మాత్రం అంత సులువేమీ కాదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు. ఇప్పుడు రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవాటిని మళ్లీ ప్రింట్ చేసి విడుదల చేసేందుకు అనుకున్న గడువు కంటే మరో ఆరు నెలలు అధికంగానే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటిదాకా జనాలకు నోట్ల కష్టాలు తీరే అవకాశం లేనట్టేననేది పరిశీలకుల అభిప్రాయం.


నల్లధనానికి చెక్ చెప్పడం కోసమని రూ.500; రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న మోదీ సర్కారు హఠాత్తుగా ప్రకటించడం తెలిసిందే. వీటి మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 30 వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. ఆ తర్వాత 2017 మార్చి చివరి వరకూ ఆర్‌బీఐ వద్ద వీటిని మార్చుకోవడానికి వీలుంది. అరుుతే, పాత 500; 1,000 నోట్ల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలంటే కనీసం వచ్చే ఏడాది మే నెల వరకూ సమయం పడుతుందని ఆర్థిక వేత్త సౌమిత్ర చౌదురి అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారుల్లో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం.


జీడీపీ వృద్ధి అర శాతం తగ్గొచ్చు...

చెల్లింపులు, కొనుగోళ్లు ఇతరత్రా లావాదేవీల్లో 98 శాతం ఇప్పటికీ కరెన్సీ రూపంలోనే జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త నోట్లకు సంబంధించి జాప్యంవల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నోట్ల రద్దు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి రేటులో అర శాతం మేర నష్టపోవచ్చని డారుుష్ బ్యాంక్ ఏజీ అంచనా వేసింది. ‘కరెన్సీ కొరత అనేక నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చిల్లుపడుతూనే ఉంటుంది. విశ్వాసం సన్నగిల్లడంతో రికవరీకి చాలా కాలం పట్టొచ్చు’ అని సౌమిత్ర చౌదురి అభిప్రాయపడ్డారు. కొత్త నోట్లను ప్రవేశపెట్టేందుకు ఎందుకు జాప్యం అవుతుందన్నదానిపై ఆయన ఒక బ్లాగ్‌లో ఈ అంశాలను పేర్కొన్నారు.


 ప్రింటింగ్ సులువేం కాదు...

‘మోదీ నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఆర్‌బీఐ గణంకాల ప్రకారం.. వ్యవస్థ నుంచి మొత్తం 1660 కోట్ల 500 నోట్లను, 670 కోట్ల 1,000 నోట్లను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం 2300 కోట్ల నోట్లను(వీటి విలువ రూ.15 లక్షల కోట్లు) ఉపసంహరించాలి. వీటి స్థానంలో కొత్తగా రూ.2,000; 500 నోట్లను తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహం. ఇప్పటికే కొంత రూ.2,000 కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేశారు కూడా. అరుుతే, అధిక విలువ(డినామినేషన్) గల కరెన్సీ నోట్లను ప్రింట్ చేసే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్‌బీఎన్‌ఎం) ముద్రణ సామర్థ్యం నెలకు 130 కోట్ల నోట్లు మాత్రమే.


ఇప్పుడు పనిచేస్తున్న డబుల్ షిఫ్ట్‌లకు మరో షిఫ్ట్‌ను జోడించి ఆగమేఘాలమీద పనిచేసినా కూడా 200 కోట్ల నోట్లను నెలకు ముద్రించొచ్చు. అంటే రూ.1,000 నోట్ల స్థానంలో కొత్తవాటిని(రూ.2,000 నోట్లు) ప్రింట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకూ పడుతుంది. బీఆర్‌బీఎన్‌ఎంతో కలిసి ప్రింటింగ్ చేసినా కూడా రూ.500 నోట్ల స్థానంలో కొత్తవి ప్రింట్ చేసి విడుదల చేయాలంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అనేక నెలలు పడుతుంది. అంటే ప్రస్తుత రూ.500, 1,000 నోట్ల డినామినేషన్ నోట్ల విలువకు సరిపడా కరెన్సీని మళ్లీ ముద్రించాలంటే చాలా కాలం వేచిచూడకతప్పదు’ అని చౌదురి వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top