పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపింగ్‌!

పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపింగ్‌! - Sakshi


సాక్షి ముంబై: పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా తినవచ్చు, కొనవచ్చు. మహారాష్ట్ర వ్యాప్తంగా షాపులు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌ ఇకపై 24 గంటలపాటు తెరిచే ఉండనున్నాయి. రాష్ట్రంలోని షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలపాటు తెరిచి ఉండేలా చట్టంలో మార్పు చేసిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. దీంతో ఇకపై రోజంతా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. కాని కొన్ని షరతులతో ఈ బిల్లును ఆమోదించారు.



ఒకవేళ 24 గంటలపాటు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచాలనుకునేవారు కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. మరోవైపు 50 మందికిపైగా మహిళలు ఉద్యోగాలు చేసే షాపింగ్‌ మాల్, రెస్టారెంట్లలో యజమాని తప్పనిసరిగా చైల్డ్‌ కేర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 100 మందికిపైగా సిబ్బంది ఉండే హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లలో క్యాంటీన్‌ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. నైట్‌ షిప్‌లో పనిచేసే మహిళలను సురక్షితంగా ఇంటి చేర్చే బాధ్యత యజమానిదేనని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి షాపులో తప్పనిసరిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలతో 24 గంటలపాటు షాపులు, మాల్స్‌ తదితరాలు తెరిచిఉంచే అవకాశం ఏర్పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top