కుప్పకూలిన షేర్లు

కుప్పకూలిన షేర్లు


భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం

సెన్సెక్స్ 465 పాయింట్లు పతనం 

నిఫ్టీ 154 పాయింట్లు డౌన్


ముంబై: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడులు జరిపిందన్న వార్తలతో గురువారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 465 పాయింట్లు (1.64 శాతం) పతనమయ్యింది. గత మూడు నెలల్లో ఇదే పెద్ద క్షీణత. అంతర్జాతీయ ట్రెండ్ అనుకూలంగా వుండటంతో ట్రేడింగ్ ప్రారంభంలో 180 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పెరిగినప్పటికీ, మధ్యాహ్న సమయంలో పాక్ సరిహద్దుల్లో దాడుల అంశాన్ని భారత్ వెల్లడించడంతో క్షణంలో షేర్లు నిలువునా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 573 పాయింట్లవరకూ క్షీణించింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 465 పాయింట్ల తగ్గుదలతో 27,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 26 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో 154 పాయింట్లు పతనమై (1.76 శాతం) 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.


 గరిష్టస్థాయి నుంచి 755 పాయింట్లు డౌన్...

ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 28,475 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరి గింది. ఆ స్థాయి నుంచి ఆర్మీ అధికారుల ప్రకటన వెలువడగానే 27,720 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ కుప్పకూలింది. గరిష్టస్థాయి నుంచి 755 పాయింట్ల పతనాన్ని (2.65 శాతం) బీఎస్‌ఈ ప్రధాన సూచీ చవిచూసింది. అలాగే నిఫ్టీ 8,800 పాయింట్ల నుంచి 8,558 పాయింట్ల వరకూ 242 పాయింట్లు (2.75 శాతం) ఇంట్రాడేలో పడిపోయింది.


 సెన్సెక్స్ షేర్లలో ఒకటి తప్ప...

సెన్సెక్స్-30లో ఒక్క షేరు తప్ప మిగిలిన 29 షేర్లూ నష్టాల్ని చవిచూసాయి. అన్నింటికంటే అధికంగా అదాని పోర్ట్స్ 5.01 శాతం తగ్గగా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్, టాటా స్టీల్, లుపిన్, టాటా మోటార్స్, ఎస్‌బీఐలు 2-5 శాతం మధ్య తగ్గాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం 0.46 శాతం పెరుగుదలతో ముగిసింది. దాడుల ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా మార్కెట్లో భయాందోళనలు వ్యాపించాయని, దాంతో అమ్మకాలు వెల్లువెత్తాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. రియల్టీ షేర్లు మిగతా రంగాలతో పోలిస్తే బాగా పడిపోయాయని ఆయన తెలిపారు. ఈ సూచి 6.31% తగ్గగా, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీ షేర్లు 8-9% మధ్య పతనమయ్యాయి. పవర్ సూచి 4.11 శాతం, హెల్త్‌కేర్ సూచి 3.26 శాతం, మెటల్ సూచి 3.17 శాతం, ఇన్‌ఫ్రా సూచి 3.15 శాతం చొప్పున తగ్గాయి.


డెరివేటివ్స్ ముగింపుతో కొంత ఊరట..

సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపునకు గురువారమే చివరిరోజుకావడంతో మార్కెట్ మరిం త పతనంకాకుండా నిలిచిందని విశ్లేషకులు చెప్పారు. ఒకే రోజున భారీ లాభాలు సంపాదించిన బేర్స్ వారి షార్ట్ పొజిషన్లను అక్టోబర్‌కు రోలోవర్ చేసేబదులు స్క్వేర్‌ఆఫ్ చేసుకోవడంతో చివరి అరగంటలో పలు లార్జ్‌క్యాప్ షేర్లు కనిష్టస్థాయి నుంచి కోలుకున్నాయని, దాంతో సూచీల పతనం ఆగిందని విశ్లేషకులు వివరించారు. లాంగ్ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్ భారీస్థాయిలో వున్నా, షార్ట్ కవరింగ్ చాలావరకూ షేర్ల భారీ పతనాన్ని నిలువరించిందని వారన్నారు.


ఇన్వెస్టర్ల సంపదలో 2.45 లక్షల కోట్లు మైనస్

గురువారం నాటి మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ. 2.45 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,360 కోట్ల మేర తగ్గి, రూ. 1,09,58,658 కోట్లకు దిగింది.


ప్రభావం కొద్ది కాలమే..

సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై దీర్ఘకాలం వుంటుందని భావించడం లేదు. 1998లో పోఖ్రాన్‌లో భారత్ అణు పరీక్షలు,  1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సందర్భాల్లో ఇరుదేశాల మధ్యా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి సంఘటనల్ని మార్కెట్ కొద్దికాలంపాటు ప్రతికూలంగా పరిగణిస్తుంది. కానీ మధ్య, దీర్ఘకాలాల్లో ప్రభావమేదీ వుండదు.

- తీర్థంకర్ పట్నాయక్, ఇండియా స్ట్రాటజిస్ట్, మిజుహో బ్యాంక్


ఇంకొన్ని రోజులు మార్కెట్‌పై ఒత్తిడి..

మరికొన్ని రోజులు మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్‌పై వుంటుంది. స్వల్పకాలంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిలో వుంటే మంచిది.

- దినేశ్ టక్కర్, సీఎండీ, యాంజిల్ బ్రోకింగ్


దీర్ఘకాలిక పెట్టుబడులకు సమస్య లేదు

ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడులు... పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న భయాలే తాజా పతనానికి కారణం. యుద్ధం జరుగుతుందని నేను భావించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక చోదకాలు పెట్టుబడులు అనుకూలంగా వున్నాయి.

-దీపేన్ సేథ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top