సిక్కా ఎఫెక్ట్‌–సెన్సెక్స్‌ 271 పాయింట్లు డౌన్‌

సిక్కా ఎఫెక్ట్‌–సెన్సెక్స్‌ 271 పాయింట్లు డౌన్‌


నిఫ్టీ 66 పాయింట్ల పతనం

ప్రపంచ ట్రెండ్‌ కూడా ప్రతికూలమే



ముంబై: ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ ప్రతికూలంగా వున్నరోజునే ఇన్ఫోసిస్‌ సీఈఓ విశాల్‌ సిక్కా రాజీనామా బాంబుపేల్చడంతో ఇన్ఫోసిస్‌ షేరుతోపాటే భారత్‌ సూచీలు పతనమయ్యాయి. స్పెయిన్‌లో ఉగ్రవాదుల దాడులు జరగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక ఎజెండాపై అనుమానాలు తలెత్తడంతో గత రాత్రి అమెరికా మార్కెట్‌ కుప్పకూలడంతో శుక్రవారం ఆసియా సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో విశాల్‌ సిక్కా రాజీనామా విషయం వెల్లడికావడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా పతనమయ్యాయి.


ముగింపు సమయంలో కనిష్టస్థాయి వద్ద స్వల్ప కొనుగోళ్లు జరగడంతో నష్టాల్లో కొంత భాగాన్ని సెన్సెక్స్‌ పూడ్చుకుని, చివరకు 271 పాయింట్ల క్షీణతతో 31,525 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,783 పాయింట్ల స్థాయివరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ..చివరకు 66 పాయింట్ల తగ్గుదలతో 9,837 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఈ వారంలో మొత్తంమీద సెన్సెక్స్‌ 311 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడగలిగాయి.  



సూచీలకు ఇన్ఫీ దెబ్బ....

ప్రధాన సూచీల్లో ఇతర రంగాల షేర్లు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ షేరు పతనం మార్కెట్‌ను బాగా దెబ్బతీసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో 10 శాతం వరకూ వెయిటేజి వున్న ఇన్ఫోసిస్‌ ఇంట్రాడేలో 14 శాతం వరకూ పతనమై 52 వారాల కనిష్టస్థాయి రూ. 884 వద్దకు పడిపోయింది. చివరకు 9 శాతం క్షీణతతో రూ. 923 వద్ద ముగిసింది.


రెండు ఎక్సే్ఛంజీల్లో కలిపి 9 కోట్ల ఇన్ఫోసిస్‌ షేర్లు చేతులు మారాయి. ఇంత భారీ ట్రేడింగ్‌ పరిమాణం ఇన్ఫీ చరిత్రలో నమోదుకావడం ఇదే ప్రధమం. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ ఈ ఒక్కరోజులోనే రూ. 22,518 కోట్లు తగ్గింది. ప్రస్తుత ధర వద్ద కంపెనీ విలువ రూ. 2,12 లక్షల కోట్లు వుంది.  హిందుస్తాన్‌ యూనీలీవర్, ఆర్‌ఐఎల్‌ వంటి ఇతర బ్లూచిప్‌ షేర్లు పెరగడంతో సూచీల క్షీణత 0.6 శాతానికి పరిమితమయ్యింది.



మరో 2 సంస్థల ట్రేడింగ్‌ ఆంక్షలపై స్టే

న్యూఢిల్లీ: షెల్‌ కంపెనీలనే అభియోగాలపై ట్రేడింగ్‌ ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇంటర్‌గ్లోబ్‌ ఫైనాన్స్, శాంకో ఇండస్ట్రీస్‌ స్టాక్స్‌లో సెబీ విధించిన ట్రేడింగ్‌ ఆంక్షలపై సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా కంపెనీలు మూడేళ్లు గా వార్షిక టర్నోవరుకు సంబంధించి సెబీ నిబంధనల ప్రకా రం నివేదికలు సమర్పిస్తూనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో సెబీ ఆంక్షలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఈ కంపెనీలపై సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజీలు తదుపరి దర్యాప్తు జరపడానికి ఈ ఉత్తర్వులేమీ అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top