రేట్ల కోత ఆశలతో...

రేట్ల కోత ఆశలతో...


సెన్సెక్స్‌కు 322 పాయింట్లు లాభం

* 27,828 పాయింట్ల వద్ద ముగింపు

* 8,400 దాటిన నిఫ్టీ...8,434కు చేరిక


జీడీపీ గణాంక అంచనాలు, రేట్ల కోత ఆశలతో శుక్రవారం స్టాక్ మార్కెట్ కళకళలాడింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతన బాటలో ఉన్నప్పటికీ,  మన మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. నిఫ్టీ 8,400 పాయింట్ల మార్క్‌ను దాటేసింది.



జూన్ సిరీస్ తొలి రోజైన శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 27,828పాయింట్ల వద్ద,  నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 8,434 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బ్యాంక్, ఫార్మా, వాహన, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో పాటు టెలికం, సిమెంట్  షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే మంగళవారం(జూన్ 2) జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలకరేట్లను తగ్గిసుతదన్న అంచనాలతో బ్యాంక్, వాహన షేర్లు జోరుగా పెరిగాయి.

 

జీడీపీ గణాంకాలపై కన్ను

జీడీపీ గణాంకాలు బావుంటాయనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. మార్కెట్ ముగిసిన తర్వాత జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.

 

ఎన్‌ఎస్‌ఈ రికార్డ్ టర్నోవర్...

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రికార్డ్ స్థాయి టర్నోవర్ నమోదైంది. కోటికి పైగా జరిగిన లావాదేవీల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో రూ.43,621 కోట్ల టర్నోవర్ జరిగింది. 117.24 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. భారతి ఎయిర్‌టెల్ బ్లాక్ డీల్  ఫలితంగా అధిక టర్నోవర్ నమోదయ్యింది. గతంలో ఏప్రిల్ 21న రూ.41,113 కోట్ల టర్నోవర్ నమోదైంది.  ఇక టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,748 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ సెగ్మెంట్లో రూ.1,77,937 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,284 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.

 

ఆరు రోజుల్లో 90 శాతం అప్

రూప అండ్ కంపెనీ షేర్ ఆరు ట్రేడింగ్ సెషన్లలో 90 శాతం పెరిగింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ నెల 21న రూ.226గా ఉన్న ఈ కంపెనీ షేర్ శుక్రవారం రూ.437 (ఇది ఆల్‌టైమ్ హై) వద్ద ముగిసింది. శుక్రవారం ఈ షేర్ 10 శాతం పెరిగింది. ఇన్నర్ వేర్ నుంచి క్యాజువల్ వేర్ వరకూ నిట్టెడ్ గార్మెంట్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది. కాగా ఎయిర్‌టెల్ షేర్ ధర 6శాతం పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top